కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రయ్యాడు. ఏడాది కిందటే తండ్రయినప్పటికీ చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు బాబు పుట్టిన సంగతిని పన్నెండు నెలలుగా దాచి ఇప్పుడు బయటకు ప్రకటించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. గతేడాది మే 14న తనకు కొడుకు పుట్టాడని, అతడికి అద్వైత్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. కొడుకు మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయగా.. ఈ వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.
2021లో పెళ్లి
అయితే అవినాష్ తన కొడుకును వెంటనే పరిచయం చేయకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఇతడు 2021 నవంబర్‌లో అనూజను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2023లో గుడ్‌న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫోటోలు, మెటర్నటీ షూట్, సీమంతం వీడియోలతో తెగ సందడి చేశారు. కానీ, ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 2024 ప్రారంభంలో అబార్షన్ అయిందని చేదువార్త చెప్పాడు.
విషాదం
తెల్లవారితే డెలివరీ అనగా అనూజ కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఏదో ఒకటి చేసి బిడ్డను బతికించమని డాక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు అవినాష్. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయాక తిరిగి బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వైద్యులు చేతులెత్తేశారు. ఊహించని ఈ విషాదానికి పిచ్చోడైపోయాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు రోడ్డుపై ఏడ్చుకుంటూ ఉండిపోయాడు.
అందుకే ఇంత సీక్రెట్
2.75 కిలోల బరువుతో పుట్టిన బిడ్డలో ప్రాణం లేకపోవడం మా ఇద్దర్నీ ఎంతో కుంగదీసిందంటూ ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తన బాధను పంచుకున్నాడు. అందుకే అనూజ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎవరితోనూ ఆ వార్తను పంచుకోలేదు. కనీసం కొడుకు పుట్టాక కూడా ఎవరికీ చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు.
చదవండి: చిన్న వయసులోనే పెళ్లి.. గర్భస్రావం.. హీరోను వదిలేస్తున్నా: సింగర్


