‘మాస్టర్‌’ టీజర్‌.. స్టైలిష్‌ లుక్‌లో విజయ్‌

Master Teaser: Vijay Plays An Unruly Teacher - Sakshi

చెన్నై: తమిళ స్టార్‌ దళపతి విజయ్‌, విజయ్‌ సేతుపతిల తాజా చిత్రం మాస్టర్‌ టీజర్‌ దీపావళి కానుకగా విడుదలైంది. దళపతి విజయ్‌ను జేడిగా పరిచయం చేస్తూ ఈ టీజర్‌ మొదలైంది. ఇందులో విజయ్‌ ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్‌గా, మద్యానికి బానిసైన తనకు తానే రాజు అనేవిధంగా కాలేజీ క్యాంపస్‌ నేపథ్యంలో సాగింది. చెప్పాలంటే కొంతమేర అర్జున్‌ రెడ్డిని తలపించింది. అయితే ఇద్దరూ పెద్ద స్టార్‌ హీరోలు కావడంతో విజయ్‌, విజయ్‌ సేతుపతిల మార్క్‌ ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు లోకేష్‌ కనకరాజు జాగ్రత్త పడినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్‌ గురించి స్థూలంగా చెప్పాలంటే... కాలేజ్‌ ప్రొఫెసర్‌ జేడి, విపరీతంగా మద్యం తాగుతూ మిగతా టీచర్‌లకు తలనొప్పిగా మారుతాడు. అంతేగాక క్యాంపస్‌ లోపలే విద్యార్థులకు, జేడికి మధ్య నెలకొన్న కొన్ని మనస్పర్థల కారణంగా చిన్నగా మొదలైన గొడవలు, వీధీ రౌడీలు కూడా కలుగజేసుకునేంత పెద్దగా మారుతాయి.

అలా క్యాంపస్‌లో విజయ్‌ సేతుపతి ఆధ్వర్యంలో రౌడీ మూకతో విజయ్‌ ఫైట్ చేస్తుంటాడు. టీజర్‌ చివరలో విజయ్‌, విజయ్‌ సేతుపతిలు ఫైట్‌ చేస్తున్న కట్‌ సీన్స్‌ పెట్టి దర్శకుడు టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మలుపు తిప్పాడు. వీరిద్దరి మధ్య సాగే ఫైట్‌ సన్నివేశాలు టీజర్‌లో హైలైట్. ఇక కాలేజ్ ప్రొఫెసర్‌ జేడి పాత్రలో విజయ్‌ మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపిస్తూనే స్టైలిష్‌ లుక్స్‌తో అదరగొట్టాడు. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్న నటిస్తోంది. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు మేజర్ హైలైట్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా 11 కోట్లకు అమ్ముడైనట్లు సినీ వర్గాల సమాచారం. ఇక థియేటర్స్ తిరిగి తెరుచుకోగానే మాస్టర్‌ సినిమా విడుదల చేయడాలనే ఆలోచనలో చిత్ర బృందం భావిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top