Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ

Masooda Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మసూద
నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు
నిర్మాణసంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్
ఎడిటర్‌: జెస్విన్ ప్రభు
విడుదల తేది: నవంబర్‌ 18, 2022

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్‌ 18) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. 

కథేంటంటే.. 
నీలం(సంగీత) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. భర్త అబ్దుల్‌(సత్య ప్రకాశ్‌)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్‌)తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే గోపీ(తీరువీర్‌) ఓ సాఫ్ట్‌వేర్‌. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్‌ రామ్‌)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్‌ అవుతాడు.  అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది.  అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్‌(సత్యం రాజేశ్‌) సలహాతో పీర్‌ బాబా(శుభలేఖ సుధాకర్‌)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?  మసూదను మీర్‌ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా హారర్‌ మూవీస్‌ వచ్చి, విజయం సాధించాయి. కానీ ఈ మధ్య కాలంలో హారర్‌  అంటే.. కామెడీనే అనేలా  సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులను భయపెట్టడం కంటే నవ్వించడమే తమ లక్ష్యం అనేలా హారర్‌ మూవీస్‌ తీస్తున్నారు. కానీ చాలా కాలం తర్వాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చింది ‘మసూద’. ఈ చిత్రం కథ పాతదే అయినా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఢిఫరెంట్‌గా సాగుతుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో జరుగుతుంది. ఆత్మలను వదిలించడానికి పీర్‌ బాబాలు వస్తారు. మసీదులో మంత్రాలు చదువుతారు. అందుకే కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలాంటి సీన్స్‌ పెడితే ప్రేక్షకులు భయపడతారో..అలాంటి వాటిపై దర్శకుడు సాయికిరణ్ మరింత ఫోకస్‌ పెట్టాడు. 

ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు హారర్‌ని చూపిస్తూ.. మరోవైపు గోపీ, మినీల లవ్‌ట్రాక్‌ని నడిపించాడు. దీంతో ఎక్కడో క్లారిటీ మిస్‌ అయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేశాడు. అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. పీర్‌బాబా ఎంటర్‌ అవ్వడంతో కథలో వేగం పెరుగుతుంది. అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.

అయితే కథనం సాదాసీదాగా సాగినా.. ఓక్కో సీన్‌ ప్రేక్షకులను దారుణంగా భయపెడుతాయి. మసూద నేపథ్యం గురించి చెప్పే క్రమంలో కొన్ని సీన్స్‌ భయానికి గురి చేస్తాయి. ఇక చివరి అరగంట మాత్రం హారర్‌ అదిరిపోతుంది. ప్రేక్షకుడిని భయపెట్టడమే లక్ష్యంగా కథనం సాగుతుంది. హారర్‌తో పాటు.. తల్లి సెంటిమెంట్‌ని కూడా టచ్‌ చేశాడు దర్శకుడు. కూతురిని గొలుసులతో కట్టేసినప్పుడు.. తల్లిగా సంగీత పడే బాధ, ఏడుపు హృదయాలను హత్తుకుంటుంది.  నిడివి ఎక్కువే అయినా.. హారర్‌ మాత్రం అదిరిపోయింది. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాకు  సంగీత, తిరువీర్‌, కావ్య, భాందవిల పాత్రలే చాలా కీలకం. గోపీ పాత్రలో తీరువీర్‌ ఒదిగిపోయాడు. హీరోలా కాకుండా నిజంగా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక సంగీత అయితే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించింది. నీలం పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టించింది. ఇక సినిమాకు మరో ప్రధాన బలం బాంధవి శ్రీదర్‌ పాత్ర. నాజియాగా ఆమె తనదైన నటనతో అందరిని భయపెట్టింది. కథంతా నాజియా పాత్ర చుట్టే తిరుగుతుంది. బాలనటిగా పలు సినిమాల్లో కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్‌.. ఈ చిత్రంలో మిలీ పాత్ర పోషించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ తెరపై అందంగా కనిపించింది. పీర్‌బాబా పాత్రలో శుభలేఖ సుధాకర్‌ ఒదిగిపోయాడు. అల్లా ఉద్దీన్‌గా సత్యం రాజేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం. ఓ హర్రర్‌ సినిమాకు సౌండ్, విజువల్స్‌ చాలా ముఖ్యం. ఈ మూవీకి ప్రశాంత్‌ ఆర్‌.విహారి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ జెస్విన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top