
మణిరత్నం(Mani Ratnam) సోదరుడు, తమిళ సినీ నిర్మాత జి. వెంకటేశ్వరన్ తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంక్ లోన్ తీసుకున్నారంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా చెన్నై ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెళ్లడించింది. అయితే, ఆయన మరణించిన 22ఏళ్ల తర్వాత తీర్పు రావడం విశేషం. మౌనరాగం నుంచి దళపతి వరకు మణిరత్నం దర్శకత్వం వహించిన పలు హిట్ సినిమాలకు జీవీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
1996లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు తమిళ చిత్ర నిర్మాత జి. వెంకటేశ్వరన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి రూ. 10.19 కోట్లు బ్యాంకు నుంచి పొందినట్లు అప్పట్లో కేసు నమోదైంది. సుమారు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించింది. అయితే, వెంకటేశ్వరన్‌తో పాటు మరో ముగ్గురు బ్యాంకు అధికారులు మరణించడంతో వారిపై ఉన్న అభియోగాలు ఇప్పటికే కొట్టివేయబడ్డాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన ఐదుగురి పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది.
అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య
మణిరత్నం అన్నయ్య వెంకటేశ్వరన్ మే 3, 2003న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుల ఒత్తిడితో ఆయన మరణించారని సమాచారం. వివిధ నిర్మాతల నుంచి అప్పులు తీసుకుని సినిమాలు నిర్మించిన జీవీ, వాటి నుంచి వచ్చిన నష్టాలను తట్టుకోలేకపోయారని కొందరు చెప్పుకొచ్చారు. ఆయనకు సినీ రంగంలో మంచి సంబంధాలు ఉన్నా.., ఆ సమయంలో ఎవరూ సహాయం చేయలేదని తమిళ నిర్మాత మాణిక్కం నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.కొడుకు పెళ్లి సమయంలో కూడా జీవీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చివరికి ఉరివేసుకుని తన జీవితాన్ని ముగించుకున్నారని తెలుస్తోంది.