
హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. అలాగే ఏ మూవీ కెరీర్‌ను ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేని పరిస్థితి. మలయాళంలో అనేక సినిమాలు చేసిన మమిత బైజు (Mamitha Baiju) 'ప్రేమలు' అనే ఒక్క మూవీతో సెన్సేషన్ అయింది. ఈ ఒక్క చిత్రంతోనే తమిళంలో అవకాశాలు వచ్చాయి. అలా జి. ప్రకాష్ కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ, ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. సాధారణంగా తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోతే అవకాశాలు మందగిస్తాయి. కానీ, మమిత బైజు విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి.
తమిళంలో అవకాశాలు
ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్‌లో ముఖ్య భూమిక పోషిస్తోంది. అదేవిధంగా క్రేజీ నటుడు ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా డ్యూడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నటి నమిత బైజు మాట్లాడుతూ.. తమిళ సినిమాల్లో నటించాలని తాను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదని తెలిపింది. అయినప్పటికీ తమిళంలో పలు వైవిద్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. అలా వచ్చిన వాటిలో మంచి కథలను ఎంపిక చేసుకొని నటిస్తున్నట్లు చెప్పింది.
తమిళం వచ్చేసింది
ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నారా ? అన్న ప్రశ్నకు.. అలాంటి పరిస్థితులు తనకు ఎదురవ్వలేదని స్పష్టం చేసింది. మొదట్లో తమిళ భాష మాట్లాడటం తనకు ఛాలెంజింగ్ అనిపించినా, తన యూనిట్‌లో మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్ వంటి వారు తమిళులు కావడంతో వారి మాటలే తాను తమిళం నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యాయంది. ఇప్పుడు తాను తమిళ భాషలో మాట్లాడటం, రాయడం కూడా నేర్చుకున్నానంది. డ్యూడ్ చిత్రంలో నటుడు ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మమిత బైజు పేర్కొంది.
చదవండి: ముచ్చటగా మూడోసారి!