
ప్రముఖ మలయాళ యాంకర్, నటి ఆర్య (Arya Babu) రెండో పెళ్లి చేసుకుంది. నటుడు, కొరియోగ్రాఫర్ సిబిన్ బెంజమిన్‌తో మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. అతడికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! ఈ ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది.
12 ఏళ్ల కూతురితో మండపానికి..
తన జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆర్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి.. తల్లిని మండపం వరకు తీసుకొచ్చింది. తల్లి మెడలో మూడు ముళ్లు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతుండగా అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఫ్రెండ్స్ భార్యాభర్తలుగా..
కుంజిరమయనం, పవ, ఉల్టా, మెప్పడియాన్, క్వీన్ ఎలిజబెత్ వంటి పలు మలయాళ చిత్రాల్లో ఆర్య నటించింది. అక్కడి బుల్లితెరపై టాప్ యాంకర్‌గా రాణిస్తోంది. మలయాళ బిగ్‌బాస్ రెండో సీజన్‌లోనూ పాల్గొంది. నటి అర్చన సోదరుడు, ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్‌ను పెళ్లాడింది. వీరికి రోయ అనే కూతురు పుట్టింది. 2019లో భర్త నుంచి విడిపోయినట్లు ఆర్య ప్రకటించింది. డీజే సిబిన్.. మలయాళ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతడిక్కూడా గతంలో పెళ్లయి పిల్లలున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమలో పడటంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.