కూతురు పుట్టగానే వాళ్లిద్దరినీ వదిలేశారంటూ..

Mahhi Vij Says All Our Children Are Equally Loved Shares Note - Sakshi

ముంబై: దత్తత తీసుకున్న పిల్లల పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, కన్న కూతురితో సమానంగా వాళ్లకు ప్రేమను పంచుతున్నామన్నారు టీవీ నటి మహి విజ్‌. వాళ్లను వదిలేశామని, పట్టించుకోవడం లేదన్న వార్తలు తమను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2011లో వివాహ బంధంతో ఒక్కటైన హిందీ టీవీ స్టార్‌ కపుల్‌ మహి విజ్‌-జై భనుశాలిలకు చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. ఈ క్రమంలో 2017లో తమ పనిమనిషి పిల్లల(రాజీవ్‌, ఖుషి)ను దత్తత తీసుకున్నారు. అయితే, తొలుత కొన్నాళ్లపాటు వీరి ఇంట్లోనే ఉన్న రాజీవ్‌, ఖుషి తర్వాత కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నారు. మహి- జై వారి ఆ చిన్నారుల పెంపకం, విద్యకు సంబంధించిన ఖర్చులు భరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కూతురు తార(2 ఏళ్లు) పుట్టిన తర్వాత ఈ జంట, రాజీవ్‌- ఖుషిలను పూర్తిగా వదిలేశారని, వారికి దూరంగా ఉంటున్నారని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. స్థార్థపరులైన మహి- జైలను ఇకపై ఫాలో అవ్వమంటూ విద్వేషపు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మహి విజ్‌ సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు.. ‘‘చాలా మంది రాజీవ్‌, ఖుషిలను వదిలేశారా అని అడుగుతున్నారు. మేం వాళ్లకు తల్లిదండ్రులం. వారి బాగోగులు చూసుకునే బాధ్యత మాపై ఉంది. తార వచ్చిన తర్వాత మా జీవితాలు మరింత అందంగా మారాయి. రాజీవ్‌, ఖుషీలకు మరో తోడు దొరికింది. అంతేకానీ వారి ముగ్గురి పట్ల మా ప్రేమలో ఎలాంటి తేడా లేదు. వాళ్లు ప్రస్తుతం వారి స్వస్థలంలో ఉన్నారు. మేం రోజూ వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉన్నాం. 

వారి సౌకర్యాన్ని బట్టి నచ్చిన సమయంలో నచ్చిన చోట ఉంటారు. పండుగలన్నీ మేమంతా కలిసే చేసుకుంటాం. మాకు ముగ్గురు పిల్లలు అన్న విషయం ఎన్నటికీ మర్చిపోం. వాళ్లకు మీ ఆశీర్వాదాలు కావాలి. అంతేగానీ, మా ప్రేమను శంకించవద్దు. దయచేసి, మా వ్యక్తిగత జీవితం గురించి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు మహికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత అంటే, 2019లో మహి- జైకి కూతురు తార జన్మించింది. ఇక వీరిద్దరు టీవీ రియాలిటీ షో ‘నచ్‌ బలియే 5’లో పాల్గొని టైటిల్‌ గెలుచుకుని ప్రాచుర్యం పొందారు. కాగా తెలుగులో డబ్‌ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా మహి విజ్‌ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది!

చదవండి: 16 పాటలు రాశావా గోవిందా.. ఏంటో అవి?!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top