
మరాఠీ రాణి, ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు ఆమె జన్మస్థలం జామ్‌ఖేడ్ తహసీల్‌లో జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆమె బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ బయోపిక్ రూపొందనుంది. మహారాష్ట్ర ఫిల్మ్, థియేటర్ అండ్ కల్చరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గుర్గావ్ ఫిల్మ్ సిటీ ఈ బయోపిక్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తాయి’’ అని తెలిపారు దేవేంద్ర ఫడ్నవీస్.
ప్రభుత్వం తరఫున ఈ సినిమాని నిర్మించనున్నారు కాబట్టి ఆయన స్వయంగా ప్రకటించారు. ఇక 1725 మే 31న అహల్యా బాయి హోల్కర్ జన్మించారు. భర్త ఖండేరావు హోల్కర్, మామ మల్హర్ రావు హోల్కర్ మరణించిన తర్వాత మాల్యా రాజ్యపు రాణిగా ఆమె సింహాసనాన్ని అధిష్టించారు. ఆ కాలంలో జరిగిన యుద్ధాల్లో సైన్యానికి నాయకత్వం వహించారు. దోపిడీ దారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అంతేకాదు... ఎన్నో హిందూ దేవాలయాలు, ధర్మశాలలను నిర్మించి పేరు, ప్రఖ్యాతులు గడించారామె.