రజనీకాంత్–కమల్‌హాసన్ మళ్లీ కలిసి నటించనున్నారనే వార్తలు కొంత కాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ సెట్ అయింది. అయితే ఇద్దరూ సిల్వర్ స్క్రీన్‌ని షేర్ చేసుకోవడం లేదు. రజనీకాంత్ హీరోగా తన నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై కమల్‌హాసన్ ఓ సినిమా నిర్మించనున్నారు.
రజనీ నటించనున్న 173వ చిత్రం ఇది. ఈ చిత్రానికి సుందర్. సి దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఐదు దశాబ్దాల స్నేహం, ఒకరంటే మరొకరికి గౌరవం, అసమానమైన వారసత్వం కలిగిన రజనీకాంత్, కమల్‌హాసన్‌ల గొప్ప కలయికలో రానున్న చిత్రం ఇది.
44 ఏళ్ల రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అద్భుత ప్రయాణం, రజనీకాంత్ అద్భుత స్క్రీన్ ప్రెజెన్స్, కథను చెప్పడంలో అత్యంత ప్రతిభ గల సుందర్ .సి, కమల్‌హాసన్–ఆర్. మహేంద్రన్‌ల కాంబినేషన్‌లో ‘తలైవర్ 173’ ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా ఉంటుంది. ‘అరుణాచలం’ తర్వాత 28 ఏళ్లకు రజనీ–సుందర్‌ల కాంబో మళ్లీ కుదిరింది. రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఈ చిత్రం 2027 సంక్రాంతికి రిలీజ్ కానుంది’’ అని ఈ చిత్రం టీమ్ ఓ ప్రెస్‌నోట్‌ని షేర్ చేసింది.


