MAA Elections 2021: బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్‌

MAA Elections 2021: Nagababu Shocking Comments On Unanimous Leader - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి  అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్‌ డేట్‌ రాకముందే ఫిల్మ్‌ సర్కిల్‌ ప్రచారాలు ఊపందుకున్నాయి. మరోవైపు సినీ ప్రముఖులు తమకు నచ్చి అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు. 

ఇక మా ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత కాక పెంచాయి. ‘టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు, వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో 'మా'కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా*అని బాలయ్య ప్రశ్నించారు. ఇప్పటివరకు 'మా'కు శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదు? అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు స్పందించారు. 

ఓ తెలుగు న్యూస్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మా బిల్డింగ్ వ్యవహారం గురించి ప్రస్తావించిన నాగబాబు ‘గతంలో మురళీ మోహన్ గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ నుంచి మా బిల్డింగ్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఎవరూ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అందుకే చాంబర్‌లోని చిన్న ఆఫీస్ రూమ్‌లో మా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి గతంలో పని చేసిన ప్రెసిడెంట్లు అందరూ బాధ్యులే' అని చెప్పుకొచ్చారు. 

అలాగే  పోటీ నుంచి తప్పుకుంటానని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ‘మంచు విష్ణు ఎన్నికల నుంచి తప్పుకుంటానడం సరైన నిర్ణయం కాదు. ఆయన పోటీలో ఉండాలి. జనాలను బెదిరించినప్పుడే ఏకగ్రీవాలు అవుతుంటాయి. మంచు విష్ణు ఎందుకు తప్పుకోవాలి? అతడిని నేను స్వాగతిస్తున్నా. ‘మా’కోసం విష్ణు బిల్డింగ్ కడతాను అన్నారు.. ఆ స్థలం ఎక్కడ ఉందో.. ఎక్కడి నుంచి తెస్తారో చెబితే బాగుండేది’అని నాగబాబు అన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌కి ఎందుకు మద్దతు ఇస్తున్నారో కూడా ఆయన వివరించారు. ‘చాలా రోజుల క్రితమే ఆయన నన్ను కలిసి ఈ విషయం చెప్పారు. బిజీ ఆర్టిస్టుగా మీరు ‘మా'కు సమయం కేటాయించగలరా అని అడిగాను. దానికి ఆయన తప్పకుండా ఇస్తాను అని చెప్పారు. ఆయనకు సౌత్‌ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వాలతో పరిచయాలు ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలో మూడు గ్రామాలను దత్తత తీసుకొని సాయం అందిస్తున్నారు. మా బిల్డింగ్‌ కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అందుకే ఆయన విజయానికి నా వంతు కృషి చేస్తా' అని నాగబాబు అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top