Lakshya Movie Review: గురి తప్పిన బాణం.. ఆర్చరీ ప్లేయర్‌గా నాగశౌర్య రాణించాడా?

Lakshya Movie Review - Sakshi

టైటిల్‌ : లక్ష్య
నటీనటులు :  నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవిప్రకాశ్, సత్య తదితరులు
నిర్మాణ సంస్థ:  శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్
దర్శకత్వం:  ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి
సంగీతం : కాలభైరవ
సినిమాటోగ్రఫీ :రామ్‌రెడ్డి
ఎడిటింగ్‌:  జునైద్ సిద్దిఖీ 
విడుదల తేది : డిసెంబర్‌ 10, 2021

Lakshya Movie Review: ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగ‌శౌర్య .. ఆ మూవీతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత  సినిమా సినిమాకూ వైవిధ్యాన్నిచూపిస్తూ టాలీవుడ్‌లో  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.  చాలా తక్కువ సమయంలోనే ఇరవై పైగా సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ‘ఛలో’సినిమాతో నిర్మాతగా మారి తొలి చిత్రమే హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, హీరోగా చేసిన న‌ర్త‌న‌శాల‌, అశ్వథ్థామ‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి.  దీంతో చాలా గ్యాప్‌ తీసుకొని ఇటీవల లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’తో ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మరోసారి ప్రయోగానికి సిద్దమై.. తన కెరీర్‌లోనే తొలిసారిస్పోర్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్‌తో ‘లక్ష్య’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ని కూడా కొత్తగా, చాలా గ్రాండ్‌గా చేయడంతో ‘లక్ష్య’పై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?  మరి ఈ సినిమా నాగశౌర్యను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? రివ్యూలో చూద్దాం

కథేంటంటే..
పార్ధు(నాగశౌర్య) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. తాతయ్య  రఘురామయ్య(సచిన్‌ ఖేడేకర్‌)దగ్గరే పెరుగుతాడు. అతని తండ్రి లాగే పార్దుకు కూడా విలువిద్య అంటే చాలా ఇష్టం. అతనిలోని క్రీడాకారుడిని గుర్తించిన తాతయ్య.. ఎలాగైన తన మనవడిని గొప్ప ఆర్చరీ ప్లేయర్‌ చేయాలని భావిస్తాడు. దాని కోసం ఊరిని వదిలి సిటీకి వస్తాడు. ఆస్తులన్ని అమ్మి మరీ మనవడి కోచింగ్‌ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి స్టెట్‌ లెవన్‌ చాంపియన్‌ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌ ట్రయల్స్‌కి సన్నద్దం అయ్యే సమయంలో గుండెపోటుతో తాతయ్య మరణిస్తాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పార్ధు.. మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. డ్రగ్స్‌ తీసుకుంటేనే అతను వదిలిన బాణం గురి తప్పేది కాదు. ఈ విషయం తెలిసి అకాడమీ అతన్ని సస్పెండ్‌ చేస్తుంది. అసలు పార్థు మత్తు పదార్ధాలకు బానిస కావడానికి కారణం ఎవరు?  అతని జీవితంలో రితికా పాత్ర ఏంటి? చనిపోదామనుకున్న సమయంలో పార్ధుని కాపాడిన సారథి(జగపతిబాబు)..ఎవరు? అతని నేపథ్యం ఏంటి? విలువిద్యకు దూరమైన పార్థు మళ్లీ చేత బాణం పట్టి రాణించాడా? వరల్డ్‌ చాంపియన్‌గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? అనేదే మిగతా కథ. 

ఎవరెలా చేశారు?
ఆర్చరీ ప్లేయర్‌ పార్థుగా నాగశౌర్య చక్కగా నటించాడు. ఈ సినిమాకు కోసం ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశాడు. అతను పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్‌ పరంగా నాగశౌర్య చాలా కొత్తగా కనిపించాడు. తాతయ్య చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక ‘రొమాంటిక్‌’భామ కేతికా శర్మ.. రితికా పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్‌తో కాకుండా నటనతో ఆకట్టుకుంది.  హీరో తాతయ్యగా సచిన్‌ ఖేడేకర్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. సారథిగా జగపతి బాబు నటన బాగుంది. సత్య, భరత్ రెడ్డి, శత్రులతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ఎలా ఉందంటే.. 
క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఈ ఏడాదిలో వచ్చిన   నితిన్‌ ‘చెక్‌’, సందీప్‌ కిషన్‌ ‘ ఏ1 ఎక్స్ప్రెస్’ కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కినవే. అయితే ‘లక్ష్య’ ప్రత్యేకత ఏంటంటే.. పూర్తిగా విలువిద్య నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో పాటు తాత మనవడి సెంటిమెంట్‌ కూడా ఉంది. అయితే అది తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్టాప్ అంతా సింపుల్‌గా, పాత సినిమాలు చూసినట్లుగా సాగుతుంది. ఎక్కడా వావ్‌ అనే సీన్స్‌ కానీ, ట్విస్టులు కానీ ఉండవు. కథంతా ముందే తెలిసిపోతుంది. హీరో డ్రగ్స్‌కి బానిస కావడం, దానికి కారణం ఎవరై ఉంటారనేది కూడా సినిమా చూసే సగటు ప్రేక్షకుడు  ఇట్టే పసిగట్టగలడు. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా కథ సాగడం సినిమాకు మైనస్‌. ఇంటర్వెల్‌ సీన్‌ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్‌ అనిపించదు.

సెకండాప్‌లో జగపతి బాబు ఎంట్రీ తర్వాత కాస్త ఆసక్తి కరంగా సాగుతుంది అనుకుంటే.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. కథ డిమాండ్‌ మేరకే ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశానని ఇంటర్యూల్లో నాగశౌర్య చెప్పారు. కానీ కథకు అది ఏరకంగా అవసరమే తెరపై చూపించలేకపోయాడు. క్లైమాక్స్‌ సీన్స్‌ కూడా చప్పగా సాగుతాయి. సినిమా  స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ఇక కాలభైరవ సంగీతం కూడా అంతంత మాత్రమే అనే చెప్పాలి. గతంలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన కాలభైరవ లాంటి యంగ్‌ మ్యూజిక్‌ డైరక్టెర్‌ నుంచి దర్శకుడు మంచి సాంగ్స్‌ని రాబట్టుకోలేకపోయాడు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. దర్శకుడు వదిలిన బాణం గురి తప్పింది. కలెక్షన్ల పరంగా  ‘లక్ష్య’ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుంతో వీకెండ్‌ వరకు వేచి చూడాలి. 


- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top