వేద, సాయి తేజ్, కిరణ్ అబ్బవరం, అక్షయ్ రామ్, మునిరాజు
‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చూసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మంచి ప్రయత్నం చేశారంటూ ఇండస్ట్రీ పెద్దలు, ఇతరులు ప్రశంసించడం హ్యాపీగా ఉంది’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్‌గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.
శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజైన ఒక్క రోజులోనే ఇందులో నటించిన ఐదారుగురికి అవకాశాలు రావడం హ్యాపీ. నెక్ట్స్ కూడా కొత్తవాళ్లతోనే చేస్తాను. కొత్తవాళ్లు రావాలి, సినిమా నిలబడాలి’’ అన్నారు. ‘‘మేము థియేటర్స్‌కి వెళ్లినప్పుడు మా సినిమాలోని పాత్రల పేర్లను ప్రేక్షకులు పలుకుతున్నారు. పాత్రలన్నీ ఆడియన్స్‌కి రిజిస్టర్ అయ్యాయనేందుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి’’ అని మునిరాజు చెప్పారు. ‘‘మా ప్రయత్నం విజయవంతమైందనే నమ్మకం కుదిరింది’’ అన్నారు వేద. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు ధైర్యాన్నిచ్చిన సక్సెస్ ఇది’’ అని సాయి తేజ్ తెలిపారు.


