మిస్‌ ఇండియా మూవీ రివ్యూ

Keerthy Suresh Miss India Movie Telugu Review - Sakshi

టైటిల్‌ : మిస్‌ ఇండియా
నటీనటులు : కీర్తి సురేశ్‌, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్‌, నదియా, నవీన్‌ చంద్ర, సుమంత్‌ శైలేంద్ర, పూజిత పొన్నాడ తదితరులు
నిర్మాణ సంస్థ: ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాత: మహేష్‌ కోనేరు
దర్శకత్వం: నరేంద్రనాథ్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌
సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్‌ లోపేజ్‌, సుజిత్‌ వాసుదేవ్‌
ఎడిటర్‌ : తమ్మిరాజు
విడుదల తేది : నవంబరు 4, 2020 ( నెట్‌ఫ్లిక్స్‌)

థియేటర్లు మూతబడి 8 నెలలు కావస్తోంది. కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలేవీ వెండితెరపై ప్రదర్శించే అవకాశం లేకపోయినప్పటికీ.. మహానటి కీర్తి సురేష్‌ అభిమానులకు మాత్రం ఓటీటీ.. ఆ వెలితి లేకుండా చేసింది. చాలా వరకు ఆమె చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌ దశలో ఉండగానే లాక్‌డౌన్‌ మొదలైన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాలు రిలీజ్‌ చేయడమే తప్ప వేరొక మార్గం లేదని తెలిసినప్పటికీ బడా నిర్మాతలు ఎవరూ ఆ సాహసం చేయలేదు. కానీ కీర్తి అభినయం, నటనా కౌశలంపై ఉన్న నమ్మకంతో ఆమె నటించిన ‘పెంగ్విన్‌’ను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు మూవీ మేకర్స్‌. దాని ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు కీర్తి సురేష్‌ ‘‘మిస్‌ ఇండియా’’  అనే మరో సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్‌ ఇండియా అంటే ఒక బ్రాండ్‌ అంటూ ట్రైలర్‌తో మ్యాజిక్‌ చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ:
మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కంటుంది మానస సంయుక్త( కీర్తి సురేశ్‌). ఎప్పటికైనా తన సొంత బ్రాండ్‌ను స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి తనేంటో ప్రపంచానికి తెలియజేయాలనే పట్టుదలతో ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ లంబసింగిలో తన తాతయ్య (రాజేంద్రప్రసాద్‌) బాల్యంలో రుచి చూపించిన హెర్బల్‌ టీపై మక్కువ పెంచుకున్న మానస.. దానినే తన బిజినెస్‌గా మలచుకోవాలనే ఆలోచనతో ఉంటుంది. అకడమిక్స్‌లో మార్కులు సాధించడం కంటే కూడా ఓ లక్ష్యంతో ముందుకు సాగడంలోనే అసలైన మజా ఉంటుందని తన తండ్రి చెప్పిన మాటలు కూడా చిన్నతనంలోనే ఆమెపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో అనుకోని కారణాల వల్ల అమెరికాకు చేరుకున్న మానస.. అక్కడ తన ఆలోచనలను ఎలా అమలు చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఒక మహిళగా, యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాగిన మానస ప్రయాణంలో కైలాశ్‌ శివకుమార్‌( జగపతి బాబు) సృష్టించిన అడ్డుంకులేమిటి? ఆశయం కోసం ప్రేమను కూడా పక్కనపెట్టిన మానస తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? ఇంతకీ మిస్‌ ఇండియా బ్రాండ్‌లో ఉన్న గొప్పదనం ఏమిటి? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:
నువ్వెంత గొప్పవాడివో ఈ ప్రపంచానికి చాటి చెబుతా అంటూ మానస తన తాతయ్యతో చెప్పిన మాటలకు కొనసాగింపుగా సాగిన ఈ కథలో మొదట.. హీరోయిన్‌ కుటుంబ పరిస్థితులు, వెనువెంటనే వాళ్లు అమెరికాకు చేరుకోవడం వంటి సీన్లు సగటు మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటలకు కాస్త భిన్నంగా సాగుతాయి. ఇక సెకండ్‌ హాఫ్‌లో అసలైన కథ మొదలవుతుంది. కాఫీ వ్యాపారంలో నంబర్‌ వన్‌గా  కైలాశ్‌ శివకుమార్‌( జగపతి బాబు) కారణంగా మానసకు ఎదురైన తొలి ఓటమితో కథలో వేగం పుంజుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన ఇండియన్‌ ఛాయ్‌కు తిరుగులేదని ప్రతీ సీన్‌ గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మాయే కదా వ్యాపారం ఎలా చేస్తుంది, విజయం ఎలా సాధిస్తుంది అనుకునే వారికి ఈ సినిమా మంచి సమాధానం. అంతర్లీనంగా మహిళా సాధికారికతకు పెద్దపీట వేసినా, కథను వినోదాత్మకంగా సాగించడంలోనూ దర్శకుడు నరేంద్రనాథ్‌ కొంతమేర సక్సెస్‌ అయ్యాడనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచే కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం అనే కాన్సెప్ట్‌ కూడా రొటీన్‌గా ఉన్నా.. కీర్తి సురేష్‌ వంటి నటిని ఈ కథకు ఎంపిక చేసుకోవడం ద్వారా హైప్‌ క్రియేట్‌ చేయగలిగాడు. అయితే సినిమా ఆసాంతం దానిని కొనసాగించలేకపోయాడు. 

ఎవరెలా నటించారు?
మహానటి సినిమాతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కీర్తి ఈ సినిమాలోనూ తన మార్కు నటనతో మంచి మార్కులే కొట్టేశారు. ఇక తానే టాప్‌లో ఉండాలనే స్వార్థం, ఓ మహిళ తనకు పోటీరావడాన్ని ఏమాత్రం సహించని విలన్‌ పాత్రలో ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపిస్తూనే కైలాశ్‌ శివకుమార్‌గా జగపతిబాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్‌, నదియా వంటి సీనియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నవీన్‌ చంద్ర, సుమంత్‌ శైలేంద్ర, పూజిత పొన్నాడ తమ పరిధి మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అల్టిమేట్‌గా ఛాయ్‌కు, కాఫీకు జరిగే యుద్ధంలో ఛాయ్‌ గెలుస్తుందని చూపించడంలో సీన్లు కొంచెం లాగ్‌ అయ్యాయని చెప్పవచ్చు. రొటీన్‌గా ఉన్న కథను.. ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్‌ కాస్త తడబడ్డాడు. థమన్‌ సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఓవరాల్‌గా మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఆశించినంత మేర వినోదం అందించలేదనే అనిపిస్తుంది. ‘‘మిస్‌ ఇండియా’’ బ్రాండ్‌ ఛాయ్‌ ఘుమఘుమలు అనుకున్న స్థాయిలో సువాసనలు వెదజల్లలేదనే చెప్పవచ్చు! కాకపోతే ఒక్కసారి మాత్రం ‘ఛాయ్’‌ను కళ్లతోనే టేస్ట్‌ చేసి ఆనందించవచ్చు!!

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top