అనుకోకుండా వచ్చిన అవకాశం.. డిజైనర్‌ టు యూ ట్యూబ్‌ స్టార్‌

Interesting Facts About Youtube Star Kriti Vij - Sakshi

‘అవకాశాలు ఊరికే రావు.. వచ్చిన వాటిని వదులుకోకూడదు’ అన్న ఫార్ములాను ఫాలో అయ్యి అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది కృతి విజ్‌. వరుస వెబ్‌ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఆమె గురించి..  

పంజాబీ కుటుంబానికి చెందిన కృతి ఢిల్లీలో పుట్టి, పెరిగింది. లండన్‌లో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది. తర్వాత ముంబై  చేరి ఇంటీరియర్‌ డిజైనర్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది.  తన సృజనాత్మక డిజైన్స్‌తో అనతికాలంలోనే  ప్రముఖ ఆర్కిటెక్ట్స్‌లో ఒకరిగా నిలిచింది. ప్రధాన పత్రికలు ఆమె ఆర్టికల్స్, డిజైన్స్‌ను ప్రచురించాయి కూడా. 

అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం ఆమెను యూట్యూబ్‌ స్టార్‌ను చేసింది. 2017లో ‘వాట్‌ ద ఫోక్స్‌’ యూట్యూబ్‌ సిరీస్‌లో ఓ చిన్న పాత్ర పోషించింది. చేసింది చిన్న పాత్రే అయినా వచ్చిన గుర్తింపు మాత్రం పెద్దదే. నటనలో ఎటువంటి అనుభవం లేకపోయినా అవకాశాల వెల్లువ ఆమె దరిచేరింది.  

ఆ సమయంలోనే నటనపై ఆసక్తి కలిగి ఇంటీరియర్‌ డిజైనర్‌ వృత్తిని వదిలేసింది. ‘ఫిల్టర్‌ కాఫీ టాక్స్‌’, ‘ఫస్ట్స్‌ సీజన్‌ 2’, ‘ ది ఇన్‌ట్య్రూడర్‌’, ‘ఇల్లీగల్‌ జస్టిస్‌ – అవుట్‌ ఆఫ్‌ ఆర్డర్‌’, ‘ లవ్‌ ట్రావెల్‌ రిపీట్‌’,  ‘బేక్డ్‌’, ‘ది గుడ్‌ వైబ్స్‌’ అనే వెబ్‌ సిరీసుల్లో నటించింది కృతి. ప్రస్తుతం ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ప్రసారమవుతోన్న ‘భూతియాగిరి’ వెబ్‌ సిరీస్‌తో అలరిస్తోంది. ఈ మధ్యనే.. సహనటుడు ప్రణయ్‌ మన్‌చందాను ప్రేమించి,పెళ్లి చేసుకుంది. 

ప్రయత్నించడం కంటే  గొప్ప శిక్షణ ఉండదనుకుంటా. నటనే తెలియని నేను నటిగా మారడమే ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌.  షోలు, సిరీస్‌లు చేస్తూనే యాక్టింగ్‌  నేర్చుకున్నా.. నేర్చుకుంటున్నా. నటిగానే స్థిరపడకుండా టెక్నీషియన్‌గానూ మారాలనుకుంటున్నా! – కృతి విజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top