
నటుడు కమల్‌హాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నటుడు నిర్మాత దర్శకుడు గాయకుడు రచయిత ఇలా పలు ముఖాలు కలిగిన అరుదైన కళాకారుడు కమలహాసన్. తమిళం తెలుగు మలయాళం హిందీ వంటి పలు భాషల్లో కథానాయకుడిగా విజయాలను సాధించిన నటుడు ఈయన. అంతేకాకుండా పలు సరికొత్త విషయాలను సినిమాకు పరిచయం చేసిన ఘనత కూడా కమలహాసన్‌కే చెందుతుంది.
(చదవండి: విడిపోవద్దురా అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న కోటి)
పలు భాషల్లో ఇప్పటికే 232 చిత్రాల్లో నటించిన కమలహాసన్ ఇటీవల తన సొంత బ్యానర్లో నిర్మించి కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్– 2 ఈయనకు 233వ చిత్రం అవుతుంది. తదుపరి తన 234 చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక నిర్మాతగాను నటుడు ధనుష్, శింబు, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈయన ఇప్పటికే పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత అవార్డులతో సత్కరించింది. కాగా తాజాగా ఈ విశ్వనటుడు విశ్వ వేదికపై జీవిత సాఫల్య అవార్డును అందుకోబోతున్నారు. ఈ నెల 27వ తేదీన అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీ య చలనచిత్రోత్సవ వేడుకల్లో కమల్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడం గమనార్హం.