సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేపించారు. విచారణలో భాగంగా అతని నుంచి వెబ్ లాగిన్స్‌తో పాటు సర్వర్ వివరాలను తీసుకుని మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు వెబ్‌సైట్లు ఓపెన్ కావడం లేదు. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను నిలిపివేశారు.
ఐబొమ్మ నిర్వహుకుడు ఇమ్మడి రవి గతంలో పోలీసులకు ఛాలెంజ చేశాడు. తన వద్ద కోట్లమంది డేటా ఉందని తనను టార్గెట్ చేస్తే ఏం చేయాలో తెలుసు అంటూ హెచ్చరించాడు. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అతని ఆదీనంలో ఉన్న వందల హార్డ్ డిస్క్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతన్ని మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు.


