
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే హైదరాబాద్‌లో సందడి చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కుమార్తె నామకరణ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్- గుత్తా జ్వాల బిడ్డకు అమిర్ ఖాన్ ముద్దుపేరు పెట్టారు. మైరా అంటూ అంటూ వారి పాపకు నామకరణం చేశారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణు విశాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య గుత్తా జ్వాలాకు ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా చాలా సార్లు ప్రయత్నించామని తెలిపారు. చాలాసార్లు విఫలం కావడంతో ఇక ఆశలు వదిలేసుకునే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. కానీ అమిర్ ఖాన్ ముంబయిలోని అతనికి తెలిసిన వైద్యుడి వద్దకు మమ్మల్ని తీసుకెళ్లారని వివరించారు. అలా అమిర్ ఖాన్ తమకు మరిచిపోలేని సాయం చేశారని అన్నారు.
విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ' జ్వాలా, నేను కొన్ని నెలల పాటు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా బిడ్డ కోసం ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదనుకుని దాదాపు ఆశలు వదిలేసుకున్నాం. అయితే చెన్నైలో వరదల సమయంలో నేను అనుకోకుండా అమీర్ సర్‌ను కలిశాను. మా గురించి తెలుసుకుని వెంటనే సాయం చేసేందుకు ముంందుకొచ్చాడు. అతను మమ్మల్ని ముంబయికి తీసుకొచ్చి వైద్యం కోసం అన్ని రకాల ఏర్పాటు చేశాడు. జ్వాలా గుత్తా తన చికిత్స కోసం ముంబయిలోనే ఉండాల్సి వచ్చింది. గుత్తా జ్వాలా తన తల్లి, సోదరీమణులతో పాటు అమీర్ ఖాన్ ఇంట్లోనే దాదాపు 10 నెలలు ఉండిపోయింది. తన ఇంట్లోనే అతిథ్యం ఇచ్చి పది నెలల పాటు మమ్మల్న ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అమీర్ సర్ తల్లి, సోదరీమణులు జ్వాలను ఎంతో బాగా చూసుకున్నారని' తెలిపారు.
ఇటీవల తన కూతురికి పేరు పెట్టమని అమీర్ సర్‌ను అడిగిన క్షణాన్ని విష్ణు విశాల్ గుర్తు చేసుకున్నారు. మాకు బిడ్డ పుట్టబోతున్నప్పుడు నేను అమీర్ సార్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపాను. ఆ తర్వాత మా పాపకు పేరు పెట్టమని అడిగాను.. వెంటనే మాకోసం హైదరాబాద్‌కు విమానంలో వచ్చి మా అమ్మాయికి మైరా అని పేరు పెట్టారు. అమీర్ సర్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి ఏమిచ్చినా సరిపోదు.. జ్వాలా, మైరా, నేను ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞులమై ఉంటామని విష్ణు విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.
కాగా.. 2023 చెన్నైలో వరదల సమయంలో అమీర్ ఖాన్ తన తల్లితో చెన్నైలో చిక్కుకున్నారు. తన తల్లికి చికిత్స కోసం కొన్ని నెలలు చెన్నైలోనే ఉన్నారు. ఆ సమయంలో విష్ణు విశాల్, అమీర్ ఖాన్ ఓల్డ్ మహాబలిపురం రోడ్ (OMR) లోని ఒకే ప్రాంతంలో నివసించారు. అప్పుడు వీరందరినీ పడవల ద్వారా రక్షించిన సంగతి తెలిసిందే.