​Hero Suriya : 'నా ఎదుగుదల వెనుక మహిళల త్యాగం ఉంది'

​Hero Suriya Speech At Viruman Sucess Meet Held At Chennai - Sakshi

ప్రతి పురుషుడి విజయం వెనుక కుటుంబంలోని మహిళల త్యాగం ఉంటుందని నటుడు సూర్య పేర్కొన్నారు. ఈయన నిర్మాతగా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కార్తీ నటించిన చిత్రం విరుమాన్‌. దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ కథానాయికగా పరిచయమైన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించారు. గత 12వ తేదీ విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. దీంతో చిత్ర యూనిట్‌ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సరదాగా గడిపారు.

చెన్నై శివారు ప్రాంతంలోని వీజీపీ గార్డెన్‌ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకలో విరుమాన్‌ చిత్రానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. కామెడీ నటుడు జగన్‌ అందరితో ఆటపాటలు, వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ కుటుంబంలో సర్దుబాటుతనం చాలా ముఖ్యమన్నారు. అందుకు చాలా సహనం కావాలని, మనకంటే మనవాళ్లు ముఖ్యమని భావించాలన్నారు. ఈ విషయాన్ని విరుమాన్‌ చిత్రంలో చెప్పామన్నారు.

నటుడు సూర్య మాట్లాడుతూ తమ వెనుక మహిళా శక్తి ఉందన్నారు. తాము పైకి ఎదగడానికి తమ కుటుంబ మహిళల శ్రమ ఎంతో ఉందన్నారు. తన తల్లి, భార్య, కూతురు ఇలా మహిళలు ఎంతో త్యాగం చేస్తున్నారన్నారు. మగవాళ్లు జయించడం సులభం అని, అదే ఆడవాళ్లు జయించాలంటే పది రెట్లు శ్రమించాలని సూర్య అన్నారు. మహిళలు ఎన్నో త్యాగాలు చేస్తుంటారని తమ పిల్లలను ముందు నెలబెట్టి వారు వెనుక  ఉంటారని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top