కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్‌

Green warrior,  Actor Vivek who targeted to plant one crore saplings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ ఇలా పరిశ్రమ ఏదైనా తనదైన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్య నటుడు వివేక్‌. ఆయన అకాల మరణం మొత్తం సినీరంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 500కి పైగా చిత్రాలు, తన మార్క్‌ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్‌ తీవ్రమైన గుండెపోటుకు గురై అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటం తీవ్ర విషాదాన్ని నింపింది. చాలా తొందర పడ్డారు సార్‌ అంటూ  ఆయన హితులు, సన్నిహితులు తీరని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు సూర్య, విక్రం, నటి జ్యోతిక, మహానటి ఫేం కీర్తి సురేష్‌తోపాటు పలువురు ప్రముఖులు వివేక్‌ మృతదేహానికి నివాళుర్పించారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ట్విటర్‌ ద్వారా వివేక్‌కు సంతాపం తెలియ‌జేస్తూ శివాజీ సినిమా షూటింగ్ నాటి జ్ఞాప‌కాలను గుర్తు చేసుకున్నారు.

నటనపైన మక్కువ మాత్రమే కాదు..వివేక్‌ ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరం పాటుపడేవారు. తన నటనా కౌశలంతో పద్మ‍శ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వివేక్‌ తనకు గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం అని ఎపుడూ చెబుతూ ఉండేవారు. ఈ  క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్‌గా చేపట్టారు. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం  ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు. ఈ విషయాన్నే ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కోరిక తీరకుండానే వివేక్‌ ప్రకృతిలో కలిసిపోయారంటూ కంటతడిపెట్టారు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన  ట్విటర్‌లో పోస్ట్‌  చేసిన వీడియోలను రీపోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఆర్‌ఐపీ వివేక్‌ సార్‌ హ్యాష్‌ట్యాగ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top