
సినీ తారలపై రూమర్స్ రావడం ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా డేటింగ్, బ్రేకప్, విడాకుల వార్తలు ఎక్కువ వింటుంటాం. ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటికి కొదువే లేదు. అయితే ఇలాంటి సినీ తారలు కూడా పెద్దగా పట్టించుకోరు. అలా ఓ బుల్లితెర జంటపై ఇటీవల కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో ప్రముఖ జంటగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దహియా, దివ్యాంక త్రిపాఠి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై నటుడు వివేక్ దహియా స్పందించారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు. అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. వాటిని చూసి తాము నవ్వుకుంటున్నామని తెలిపారు. తన మ్యూజిక్ వీడియో ఇష్టం లాంఛ్ సందర్భంగా మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
వివేక్ దహియా మాట్లాడుతూ..' అలాంటి వార్తలు చూసి నేను, దివ్యాంక నవ్వుకుంటాం. ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తాం. ఇంకా చాలాసేపు మాట్లాడుకోవాలనుకుంటే అలాగే పాప్‌కార్న్ ఆర్డర్ చేసుకుని మరీ తింటాం. నేను కూడా యూట్యూబ్ వ్లాగింగ్ చేస్తా. కాబట్టి క్లిక్ బైట్ ఎలా పని చేస్తుందో నాకు బాగా తెలుసు. ఇవన్నీ నాకు బాగా అర్థమవుతాయి. మీరు ఏదైనా సంచలనాత్మకంగా ఉంచితేనే ప్రజలు వాటిని చూస్తారు. కానీ అందులో అసలు నిజం ఉండదు. అలాంటి అవాస్తవాలను మనం ప్రోత్సహించకూడదు' అని అన్నారు.
కాగా.. ఫీల్ గుడ్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సురభి చందనా నిర్మించిన 'ఇష్టం' అనే కొత్త మ్యూజిక్ వీడియోలో నటుడు అనైరా గుప్తా సరసన వివేక్ దహియా నటించారు. ఈ వీడియో ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో వివేక్ మాట్లాడారు. అంతకుముందు వివేక్ దహియా, నటి దివ్యాంక త్రిపాఠి 'యే హై మొహబ్బతే' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ ప్రారంభించారు. అనంతరం 2016లో వివాహం చేసుకున్నారు.