Gangster Gangaraju Movie Review: ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ మూవీ రివ్యూ

Gangster Gangaraju Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు
నటీనటులు : లక్ష్య్‌,  వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
దర్శకత్వం: ఇషాన్ సూర్య‌ 
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: క‌ణ్ణ పి.సి.
ఎడిటర్‌ :  అనుగోజు రేణుకా బాబు
విడుదల తేది : జూన్‌ 24,2022

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో లక్ష్. 'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. తాజాగా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ శుక్రవారం(జూన్‌ 24) విడుదలైన ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
దేవరలంకకు చెందిన గంగరాజు(లక్ష్య్‌) ఓ గ్యాంగ్‌ని వేసుకొని ఆవారాగా తిరుగుతుంటాడు. తండ్రి నాగరాజు( గోపరాజు రమణ) రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్‌ కావడానికి సిద్దంగా ఉంటాడు. కొడుకు మాత్రం జులాయిగా తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. గంగరాజు ఉండే ఏరియాలోకే కొత్తగా వస్తుంది ఎస్సై ఉమాదేవి( వేదిక దత్త). ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె ప్రేమని పొందడం కోసం నానా తిప్పలు పడుతుంటాడు. ఇలా సాధారణ జీవితాన్ని గడుపుతున్న గంగరాజు...అనుకొని సంఘటన వల్ల దేవరలంకలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ సిద్దప్పని హత్య చేస్తాడు. ఆ తర్వాత గంగరాజు జీవితమే మారిపోతుంది. ఊరంతా అతన్ని గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు అని పిలవడం స్టార్ట్‌ చేస్తుంది. అసలు సిద్దప్పని గంగరాజు ఎందుకు హత్య చేశాడు? దేవరలంకకు చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) బామ్మర్ది బసిరెడ్డి(చరణ్‌ దీప్‌)తో గంగరాజుకు ఉన్న వివాదం ఏంటి? దేవరలంక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న రౌడీ బసిరెడ్డిని గంగరాజు ఎలా మట్టుబెట్టాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’.. ఈ టైటిల్‌ వినగానే బండ్లు గాల్లోకి ఎగరడాలు, బాంబులు, చేజింగ్ లు, ఫైటింగ్ ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ స్టోరీ అంతా ఒక ఫిక్షనల్ టౌన్‌లో జరుగుతుంది. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. కథంతా కామెడీగా సాగుతూనే అక్కడక్కడ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చాడు దర్శకుడు ఇషాన్ సూర్య. ఫస్టాఫ్‌ అంతా ఉమాదేవి, గంగరాజుల ప్రేమ చుట్టే సాగుతుంది. ఉమాదేవి ప్రేమను పొందేందుకు గంగరాజు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. అలాగే బామ్మగా అన్నపూర్ణమ్మ చేసే ఫైట్‌ సీన్‌ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు అసలు రూపం బయటపడుతుంది. బసిరెడ్డి నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే నర్సారెడ్డిని బకరా చేసిన తీరు అందరిఊఈ నవ్విస్తుంది. క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. 

ఎవరెలా చేశారంటే..
వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో లక్ష్య్‌. సినిమా సినిమాకి తన పాత్రలో వేరియష్‌ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ‘వ‌ల‌యం’ వంటి గ్రిప్పింగ్‌ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన లక్ష్య్‌ ఈ సారి త‌న‌దైన పంథాలో ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ అనే డిఫ‌రెంట్ మూవీతో వచ్చాడు. గంగరాజుగా లక్ష్య్‌ అదరగొట్టేశాడు. కామెడీ, ఫైట్స్‌, ఎమోషనల్‌.. ఇలా ప్రతి సీన్స్‌లో అద్భుతమైన నటనను కనబరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు.

ఎస్సై ఉమాదేవిగా వేదికదత్త తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. గంగరాజు తండ్రి నాగరాజు పాత్రలో గోపరాజు రమణ ఒదిగిపోయాడు. ఒక ఎమ్మెల్యే నర్సారెడ్డిగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తనదైన కామెడీతో నవ్వించాడు. బసిరెడ్డిగా చరణ్‌ దీప్‌ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సాయి కార్తీక్‌ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. క‌ణ్ణ పి.సి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ చాలా బ్యూటిఫుల్‌గా తీశాడు. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top