
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఆమిర్‌పై ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 1990 నాటి సంఘటనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఫైసల్ ఖాన్ చేసిన కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో ఆమిర్ రిలేషన్ షిప్ ఉన్నాడని ఫైసల్ అన్నారు. వారిద్దరికి జన్మించిన ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి భార్య రీనాతో కలిసి ఉన్నప్పుడే జెస్సికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆమిర్‌పై సంచలన ఆరోపణ చేశారు. రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్.. ఎక్కువగా జెస్సికాతోనే ఉండేవాడన్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని కేవలం లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని చెప్పారు. అయితే, కొంతకాలం తర్వాత కిరణ్ రావును ఆమిర్ పెళ్లి చేసుకున్నాడని అప్పటికీ కూడా జెస్సికాతో టచ్‌లో ఉండేవాడని చెప్పుకొచ్చారు.

1990లలో, ఆమిర్ ఖాన్, జెస్సికా హైన్స్ కలిసి ఉన్నారని, వారి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని కొన్ని మీడియా కథనాలు చాలారోజుల క్రితమే పేర్కొన్నాయి. జెస్సికా హైన్స్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జాన్ (Jaan) అని ఆ కథనాలు తెలిపాయి. కానీ, ఆమిర్ ఖాన్ ఈ విషయాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, జెస్సికా మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని పరోక్షంగా సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె కూడా స్పష్టంగా ఈ రిలేషన్ గురించి ఏమీ చెప్పలేదు.