
‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్స్ నితిన్–భరత్ చెప్పారు. ప్రదీప్ మాచిరాజు(pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్– మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి ఫస్ట్ సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. అప్పుడే ఆయనతో సినిమా తీయాలనుకున్నాం. అలా మేం చెప్పిన కథ ప్రదీప్‌కి నచ్చడంతో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఆరంభమైంది.
ఇది పవన్ కల్యాణ్ గారి సినిమా టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుందని అనుకున్నాం. అలాగే కాన్సెప్ట్ కూడా టైటిల్‌కి యాప్ట్‌గా ఉండడం వల్లే పవన్ కల్యాణ్ గారి టైటిల్ తీసుకోవడం జరిగింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లా రూపొందిన ఈ సినిమాలో వినోదం సందర్భానుసారంగా, ఆర్గానిక్‌గా ఉంటుంది.
తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుని, ఆడిషన్స్ చేసి, దీపికని తీసుకున్నాం. ప్రదీప్‌గారి ఫ్రెండ్స్ ఈ మూవీ నిర్మించారు. రథన్‌గారి అద్భుతమైన సంగీతం, బాల్ రెడ్డిగారి విజువల్స్ ఆకట్టుకుంటాయి. మా సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కి నచ్చడంతో విడుదల చేస్తున్నారు’’ అన్నారు.