కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు.. అవి సహజమే: డైరెక్టర్‌ | Director Diamond Ratnababu Comments on Unstoppable Movie | Sakshi
Sakshi News home page

తమిళంలో ఆ ఛాన్స్‌ ఉంది.. తెలుగులోనూ అది మొదలైంది: డైరెక్టర్‌

Published Tue, Jun 6 2023 4:08 AM | Last Updated on Tue, Jun 6 2023 8:55 AM

Director Diamond Ratnababu Comments on Unstoppable Movie - Sakshi

‘‘ప్రతి రచయిత, దర్శకుడు వారి బలాలు ఏమిటో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. రచయితగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ (కొన్ని కామెడీ సన్నివేశాలు), ‘సీమశాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’లాంటి నవ్వించిన సినిమాలే నాకు ఇండస్ట్రీలో పేరు తెచ్చాయి. దర్శకుడిగా నేను చేసిన రెండు సినిమాలు (బుర్రకథ, సన్నాఫ్‌ ఇండియా) ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో నా బలం కామెడీ అని నమ్మి ‘అన్‌స్టాపబుల్‌’ మూవీ చేశాను. ఇకపై ప్రతి ఏడాది నా నుంచి ఓ నవ్వించే సినిమా వస్తుంది. ఒకవేళ ప్రయోగాలు చేయాలనుకుంటే ఓటీటీలో చేస్తా’’ అన్నారు డైమండ్‌ రత్నబాబు.

వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సా ఖాన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రజిత్‌ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కల్యాణ్‌ పాత్రలో సన్నీ, జిలానీ రాందాస్‌గా సప్తగిరి నటించారు. చాలామంది హాస్యనటులు నటించారు. ఇక ‘అన్‌స్టాపబుల్‌’ సినిమా కాన్సెప్ట్‌ని చెప్పలేను. కానీ ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో అన్ని పాత్రలు ఓ పాయింట్‌కు కలుస్తాయి. ఈ అంశాలను థియేటర్స్‌లోనే చూడాలి.

సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో రజిత్‌రావు రాజీ పడకుండా నిర్మించారు. నిజం చెప్పాలంటే.. యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాలను తీయడం కంటే కామెడీ సినిమాలు తీయడం కత్తిమీద సాము వంటిది. కానీ ఈ విషయంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లు సక్సెస్‌ అయ్యారు. నేను రచయితగా ఎలా అయితే నవ్వించానో దర్శకుడిగానూ నవ్వించే సినిమాలే చేస్తాను.

ఏ రచయిత అయినా కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (డైరెక్టర్‌) కావాలనుకుంటాడు. నేను అలానే రచయిత నుంచి దర్శకుడిని అయ్యాను. నేను రచయితగా ఉన్నప్పుడు కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు. మన కుటుంబాల్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో కూడా అలాంటివి సహజమే. అయినా ఇప్పుడు ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉన్నాడు. తమిళ పరిశ్రమలో ఎవరైతే కథ రాస్తారో వాళ్లకే దర్శకత్వం చేసే చాన్స్‌ కూడా ఉంటుంది. తెలుగులో కూడా అది మొదలైనట్లుంది’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement