
కోడి రామకృష్ణ.. టాలీవుడ్‌కి పరిచయం అక్కర్లేని పేరు ఇది. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది దర్శకుల్లో ఆయన ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలే కాదు ఆయన లుక్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. వేళ్లకు ఉంగరాలతో పాటు తలకు తెల్లటి కర్చీఫ్ కట్టుకోకుండా ఆయన బయటకు వచ్చేవాడు కాదు. సినిమా షూటింగ్ సమయంలో కచ్చితంగా నుదుటికి తెల్లకట్టు ఉండాల్సిందే. ఈ ‘తలకట్టు’ వెనుక పెద్ద రహస్యమే ఉందట. తాజాగా ఆ రహస్యాన్ని కోడి రామకృష్ణ శిష్యుడు, దర్శకుడు,నటుడు దేవిప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
ఒకే రోజు మూడు సినిమాలు..
కోడి రామకృష్ణ దగ్గర నేను 20 సినిమాల వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆయనది కంప్యూటర్ బ్రెయిన్. రోజు మొత్తం పని చేసేవాడు. అప్పట్లో ఒకే రోజు మూడు సినిమాల షూటింగ్స్ కూడా చేసేవాడు. ఇక్కడో షాట్..అక్కడో షాట్.. లైన్‌లో పెట్టి అవి సెట్ చేసేలోపు ఇంకో సినిమా షూటింగ్‌కి వెళ్లి వచ్చేవాడు. ఏ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోయేవాడు కాదు. అసలు ఆయన ఇంకో సినిమా షూటింగ్‌కి వెళ్లి వచ్చాడనే విషయం మాకు(డైరెక్టర్ టీమ్) తప్ప వేరే వాళ్లకు తెలిసేది కాదు. ఉదయం 7 గంటలకే షూటింగ్ స్టార్ట్ చేసేవాడు. ఉదయం 9.30గంటల వరకు ఒక షాట్..తర్వాత బ్రేక్ ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో పెద్ద సీన్ షూటింగ్ చేసేవాడు. అర్థరాత్రి 2 గంటల వరకు కూడా షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
తల‘కట్టు’ రహస్యం ఇదే..
‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ లేదా అంతకంటే ముందు సినిమా నుంచో ఆయన తలకు తెల్లటి కర్చీఫ్ కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. దాని వెనుక కథను ఆయనే చాలాసార్లు చెప్పారు కూడా. ఆయన నుదురు భాగం చాలా పెద్దగా ఉంటుంది. ఓసారి షూటింగ్ సమయంలో మేకప్ మ్యాన్ వచ్చి..‘నుదురు భాగం పెద్దగా ఉంది. ఎండ తాకకుండా నుదుటికి కట్టు కట్టండి’ అని తెల్లటి కర్చీఫ్ ఇచ్చాడు. ఆ రోజంతా ఆయనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపించిందట.
ఆ తర్వాత నుంచి తలకు తెల్లటి కర్చీఫ్ కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అలా కట్టుకొని దర్శకత్వం వహించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘సెంటిమెంట్ కోసమే కోడి రామకృష్ణ తలకు తెల్లటి కర్చీఫ్ కట్టుకున్నాడు’అని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆయన మాములగానే అలా కట్టుకున్నాడు. మీడియా అలా ప్రచారం చేయడంతో..రామకృష్ణ కూడా తలకట్టుని కంటిన్యూ చేశాడు. ఇదే విషయాన్ని గతంలో కోడి రామకృష్ణ కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కాగా, వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2019లో కన్నుమూశారు.