‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ చిత్రాల హీరో ఆశిష్ నటిస్తున్న తాజా సినిమా ‘దేత్తడి’. ఆదిత్య రావు గంగసాని దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఘన్ను అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. హైదరాబాద్‌లో జరిగే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి బోనాలు, వినాయక చవితి, సదర్... ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఆదిత్య ఈ సినిమా తీస్తున్నారు. ఏడాది పాటు ఆశిష్, ఆదిత్యలు బ్యాండ్ వాయించే వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ల గురించి తెలుసుకుంటూ, వాళ్ల జీవితాల్లోని ఇన్సిడెంట్స్ అన్నింటినీ పోగు చేసుకుని, ‘దేత్తడి’ కథను రాశారు.
తమ గురించి సినిమా తీస్తున్నారనే ఆనందంతో దాదాపు ఆరు వందల మంది స్ట్రీట్ డ్రమ్మర్స్ ఉచితంగా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రతి బ్యాండు వాళ్ల దగ్గరకు వెళ్లి, బ్యాండ్ ఎలా కొట్టాలి? ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి.. ఇలా నేర్చుకుని, ఈ సినిమా కోసం రెడీ అయ్యాడు ఆశిష్. హైదరాబాద్ కల్చర్‌ని ప్రపంచానికి గొప్పగా చూపించబోయే సినిమాతో వస్తున్నారు’’ అని అన్నారు.
‘‘ప్రతి బ్యాండ్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. మీతో పాటు మా ఇజ్జత్ కోసం ఈ సినిమా తీస్తున్నాం’’ అని చెప్పారు ఆశిష్. ‘‘అందరికీ గుర్తుండిపోయేలా ఈ మూవీని తీస్తాం’’ అని చెప్పారు దర్శకుడు ఆదిత్య. ‘‘హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అసలైన హైదరాబాద్ కల్చర్‌ను చూపించే తొలి సినిమా ఇదే అవుతుంది’’ అని పేర్కొన్నారు రైటర్ ప్రసన్న.


