
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)ను చూసి మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju). విజయ్‌ను ఇక్కడి హీరోలు ఫాలో అయిపోతే నిర్మాతలకు చాలా ఖర్చు తగ్గుతుందని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్‌గారు చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్. తను పక్కాగా కొన్ని డేట్స్ ఇచ్చి.. అందులోనే సినిమా పూర్తి చేయాలని చెప్తాడు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? ఎప్పటివరకు పూర్తి చేస్తారు? అని ముందే అడిగి తెలుసుకుంటాడు.
ప్రతి హీరో పాటిస్తే..
నెలలో 20 రోజులు షూటింగ్‌కు కేటాయించేవాడు. అలా ఆరు నెలలపాటు డేట్స్ ఇచ్చాడు. వారసుడు సినిమాకుగానూ నాకు 120 రోజులు డేట్స్ ఇచ్చాడు. అందులోనే సినిమా కంప్లీట్ చేశాం. ఈ రూల్ ప్రతి హీరో పాటిస్తే నిర్మాతకు అది సువర్ణావకాశం అవుతుంది. ప్రతి హీరో ఆరునెలల్లో ఎన్ని రోజులు డేట్స్ ఇస్తారో ముందే నిర్ణయించుకుని, అందులోనే మూవీ పూర్తి చేసుకోవాలని చెప్పేస్తే అందరిపై ఒత్తిడి ఉంటుంది. సమయానికి సినిమా అయిపోవాలని నిర్మాత, టెక్నీషియన్స్, దర్శకుడు.. ఇలా అందరూ ఎక్కువ కష్టపడతారు. ప్రీ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం తీసుకుని ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, ఈ విధానం మన దగ్గర పూర్తిగా కనుమరుగైపోయింది.
ఖర్చులు తడిసిమోపెడు
ఆ సిస్టమ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. నాతో కలిసి వర్క్ చేయబోయే హీరోలను కూర్చోబెట్టుకుని డేట్స్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోమంటున్నాను. ప్రతి నెలలో 20 రోజులు నాకు ఇచ్చేయమని చెప్తున్నాను. విజయ్, నితిన్‌లకు అదే చెప్పాను. లేదంటే ఏడాదిలో తీయాల్సిన మూవీ రెండేళ్లలో పూర్తయ్యేసరికి ఖర్చులు రెట్టింపవుతున్నాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు, ప్రొడక్షన్ టీమ్‌కు ఇచ్చే జీతాలు.. ఇలా అన్నీ తడిసిమోపెడవుతున్నాయి. ఈ పద్ధతి మారాలంటే అది హీరోల చేతిలోనే ఉంది. వారు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
చదవండి: తెలుగువాళ్లు అస్సలు తగ్గేదేలే.. పుష్ప డైలాగ్స్‌తో అదరగొట్టిన బన్నీ