విక్రమ్- దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’.. సుమారు పదేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. సినిమా మొదలు పెట్టిన సమయం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్ట్ చివరకు కోర్టు వరకు పంచాయితీ చేరింది. హీరో శింబుతో దర్శకుడు గౌతమ్ మేనన్ ఒక సినిమా చేస్తానని ఒప్పుకుని రూ. 2.40 కోట్లు అడ్వాన్స్ తీసుకుని పూర్తి చేయలేదంటూ ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ చెన్నై హకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు డబ్బు తిరిగి ఇచ్చిన తర్వాతే ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో ‘ధృవ నక్షత్రం’ చిత్రానికి బ్రేకులు పడ్డాయి.
‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదలకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాల వాదనలను మద్రాస్ హైకోర్టు వినడం పూర్తి చేసింది. కోలీవుడ్‌లో తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 24న తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ‘ధృవ నక్షత్రం’ మూవీ విడుదలపై క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో రీతూవర్మ, సిమ్రన్, ఐశ్వర్య రాజేశ్, రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు.


