
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రెండురోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. దీనికి కారణం ఆమె 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో నటించకపోవడమేనని చెప్పవచ్చు. కల్కి సీక్వెల్‌లో దీపిక భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో ఈ వార్త వైరల్ అయిపోయింది. దీపికా పదుకొణె ఏ కారణంతో నటించడం లేదో తెలియనప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా దీపికా తన కొత్త సినిమా గురించి ఒక పోస్ట్ చేశారు.

దీపికా పదుకొణె, షారుక్ ఖాన్ ఆరోసారి జంటగా మరో సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటిస్తూ ఇలా ఒక పోస్ట్ చేశారు. '18 సంవత్సరాల క్రితం 'ఓం శాంతి ఓం సినిమా' చేస్తున్నప్పుడు ఆయన (షారుక్ ఖాన్) నాకు మొదటి పాఠం నేర్పారు. ఒక సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం.. ఎవరితో కలిసి పనిచేస్తున్నామనే విషయాలే ఉన్నాయి. ఒక సినిమా విజయం కంటే ఎంతో ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఆ మాటలనే ఇప్పటికీ నమ్ముతాను. ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆ పాఠాన్నే అమలుచేస్తున్నాను. అందుకే మేము మళ్ళీ కలిసి 6వ సినిమా చేస్తున్నాము.' అని తెలిపారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనే విషయం తెలిసిందే.
కల్కి సినిమా నుంచి ఆమెను తప్పించిన తర్వాత ఈ పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది. కల్కిలో దీపికా పదుకొణె పర్‌ఫార్మెన్స్ చాలా బాగుందని గతంలోనే తెలుగు అభిమానులు కూడా చెప్పుకొచ్చారు. తన క్యారెక్టర్‌లో ఆమె లీనమై నటించారని ప్రశంసించారు. ఇప్పుడు ఆమె పాత్రలో మరొకర్ని ఊహించుకోవడం కష్టమని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఆమె పాత్రను రీప్లేస్ చేసే సత్తా ఉన్న నటి ఎవరనేది పెద్ద చర్చగా కొనసాగుతుంది.