హీరోయిన్లు ధరించే దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్స్ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఎలాంటి దస్తులు ధరించాలో ఆయన చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.తప్పు డ్రెస్సింగ్‌లో లేదని.. చూసే చూపులోనే ఉందంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సింగర్ చిన్మయి అయితే శివాజీనీ ఏకంగా పోకిరీల హీరో అని విమర్శించారు. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ..ముందుగా జీన్స్, హూడీ ధరించకుండా ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ చిన్మయి కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
(చదవండి: మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది: చిన్మయి)
ఇక తాజాగా నటి, యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) కూడా తన యాంకర్ శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రత్యేక్షంగా శివాజీని విమర్శించకపోయినా.. పరోక్షంగా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ..‘ఇది నా శరీరం.. నీది కాదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ కొంతమంది నెటిజెన్లు అనసూయ కి సపోర్ట్ గా నిలిచారు. మరికొంతమంది ఏమో శివాజీ మంచి సలహానే ఇచ్చారంటూ అనసూయని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.
శివాజీ ఏమన్నారంటే.. ?
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు.


