ముఖంపై పిడిగుద్దు ఘటన.. విల్‌ స్మిత్‌ ఆస్కార్‌ వెనక్కి తీసేసుకుంటారా?

Could Will Smith Lose Oscar For Punching Chris Rock On Stage - Sakshi

ఆస్కార్స్‌ 2022 ఈవెంట్‌ వేదికగా జరిగిన షాకింగ్‌ ఈవెంట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నటుడు విల్‌ స్మిత్‌, మరో నటుడు క్రిస్‌ రాక్‌ను స్టేజ్‌పైనే ముఖం పగల కొట్టిన ఘటన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  విల్‌ స్మిత్‌కు దక్కిన బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది.

విల్‌ స్మిత్‌.. క్రిస్‌ రాక్‌ చెంప పగలకొట్టిన ఘటన వీడియో సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఇన్సిడెంట్‌ ఈవెంట్‌ లైవ్‌లో టెలికాస్ట్‌ కాలేదు. పైగా ఈ ఘటన తర్వాత ఆస్కార్స్‌ 2022 ఈవెంట్‌ను కాసేపు నిలిపేసినట్లు సమాచారం. అయితే కాసేపటికే ఆ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఇదంతా  స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు ఈ ఈవెంట్‌ వేదికగానే విల్‌ స్మిత్‌ బెస్ట్‌ యాక్టర్‌గా ఆస్కార్‌ ట్రోఫీ అందుకున్నారు.. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారు.  అయితే అకాడమీ రూల్స్‌ ప్రకారం.. విల్‌ స్మిత్‌ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అకాడమీ సహించదు. ఈ రాత్రి మా 94వ అకాడమీ అవార్డుల వేడుకలు జరగడం, విజేతల గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాము.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులు, సినీ ప్రేమికుల నుండి ఈ క్షణానికి గుర్తింపు పొందారు (sic)’’ అంటూ ట్వీట్‌ చేసింది అకాడమీ. 

ఇక ఇలాంటి సందర్భాల్లో అకాడమీ గట్టి చర్యలు తీసుకోవాలని, సరైన మార్గదర్శకాలు రిలీజ్‌ చేయాలని, అసలు ఈ ఉదంతాన్ని ఒక దాడిగా పరిగణించి విల్‌ స్మిత్‌ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అకాడమీ మాత్రం అవార్డు వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయలేదు.

అకాడమీ రూల్స్‌ ఏం చెబుతోందంటే.. 

2017లో విడుదల చేసిన అకాడమీ కండక్ట్‌ కోడ్‌.. అకాడమీ విలువలను పరిరక్షించడంతో పాటు అవతలి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అంతేకాదు..  అకాడమీ వాతావరణంలో అనైతికంగా వ్యవహరించకూడదు కూడా.  

అయితే విల్‌ స్మిత్‌ దాడి విషయంలో.. స్టేజ్‌ మీద ఉన్న క్రిస్‌ రాక్‌.. విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌ మీద జోక్‌ పేల్చాడు. ఆమె చూడడానికి జీఐ జేన్‌ 2(సినిమా.. అందులో లీడ్‌ రోల్‌) లాగా ఉందంటూ కామెంట్‌ చేశాడు. కానీ, జాడా అలోపెషియాతో బాధపడుతోంది. ఆ  అనారోగ్యం వల్లే ఆమె జుట్టు రాలిపోగా.. అలా గుండు లుక్‌తో దర్శనమిచ్చింది. అందుకే భార్య మీద వేసిన జోక్‌కు విల్‌ స్మిత్‌కు మండిపోయి గూబ పగలకొట్టి ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

విల్‌ స్మిత్‌, జాడా పింకెట్‌లు 1997లో వివాహం చేసుకున్నారు. 2018లో జాడా తనకు ఉన్న అలోపెసియా గురించి ఓపెన్‌ అయ్యింది. తద్వారా  గొంతు సమస్యలు, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top