
రజినీకాంత్ 'కూలీ' సినిమా నుంచి రీసెంట్‌గా 'మోనికా' అనే సాంగ్ రిలీజైంది. ఇందులో పూజా హెగ్డే డ్యాన్స్ చేసింది. పాట కొందరికి నచ్చింది, కొందరికి ఓకే అనిపించింది. ఆ సంగతి పక్కనబెడితే లెక్క ప్రకారం పూజా స్టెప్పులు ఫేమస్ కావాలి. కానీ ఇదే పాటలో ఆమెతో కలిసి డ్యాన్స్ చేసిన నటుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే అంతలా ఫేమస్ అయిపోయాడు. ఇంతకీ ఎవరతడు?
ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ నటుడి గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఇతడి పేరు సౌబిన్ షాహిర్. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన ఇతడు.. ప్రొడక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశాడు. సహాయ దర్శకుడిగా చేస్తున్న టైంలోనే చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. అయితే 2018లో 'సుదాని ఫ్రమ్ నైజీరియా' మూవీతో మంచి గుర్తింపు దక్కింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూవీ సౌబిన్ జీవితాన్ని మలుపు తిప్పింది.
(ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)
ఈ సినిమాలో సౌబిన్ నటనకుగాను కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం దక్కింది. దీని తర్వాత కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచమ్ ఇలా పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలకించగల ఇతడు.. గతేడాది 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రంతో నిర్మాతగా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'కూలీ'తో అదృష్టం పరీక్షించుకునేందుకు రాబోతున్నాడు.
లోకేశ్ కనగరాజ్ తీసిన 'కూలీ'లో నటించిన టైంలోనే సౌబిన్‌కి మిగతా చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ దీనికోసం దాదాపు 7-8 మూవీస్‌ని వదులుకున్నాడు. ఇప్పుడేమో మోనికా పాటలో సౌబిన్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పూజా హెగ్డే కంటే ఇతడి డ్యాన్స్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. మరి మూవీ రిలీజ్ తర్వాత సౌబిన్‌కి ఇంకెంత ఫేమ్ తెచ్చుకుంటాడో చూడాలి?
(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో మోసపోయిన యాంకర్ అనసూయ)