గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్‌ | Sakshi
Sakshi News home page

గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్‌

Published Sun, Jul 9 2023 4:10 AM

Chiranjeevi, Mohanlal, Dhanush blad look movies - Sakshi

హీరో అంటే ఫ్యాన్స్‌కి స్టయిలిష్‌గా కనబడాలి.. హెయిర్‌ స్టయిల్, డ్రెస్సింగ్, వాకింగ్‌... ఇలా అన్నీ స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్‌ స్టయిలులే అన్నట్లు ఉండాలి. ఫ్యాన్స్‌ ఇలానే కోరుకుంటారు. కానీ తమ హీరోని ‘గుండు’లో చూడాలనుకోరు. ఒకవేళ గుండులో కనిపించే క్యారెక్టర్‌ చేస్తున్నారని తెలిస్తే ‘బాగుండునా!’ అని చర్చించుకుంటారు. చివరికి లుక్‌ చూశాక ఈ క్యారెక్టర్‌ చేస్తే ‘బాగుండు’ అనుకుంటారు. మరి.. గుండులోనూ స్టయిలిష్‌గా కనిపిస్తే ఎందుకు కాదంటారు. ఇక ఈ లుక్‌లో చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్‌ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

భోళా శంకర్‌లో...
వెండితెరపై ఇప్పటివరకూ చిరంజీవి గుండుతో కనిపించలేదు.. ఎందుకంటే క్యారెక్టర్‌ డిమాండ్‌ చేయలేదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్‌ డిమాండ్‌ చేసింది.. అంతే.. గుండుతో కనిపించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ‘భోళా శంకర్‌’. అజిత్‌ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్‌ ఇది. తమిళ వెర్షన్‌లో అజిత్‌ పూర్తి గుండుతో  కనిపించలేదు... అయితే దాదాపు ‘హెడ్‌ షేవ్‌’ చేసుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం నున్నటి గుండుతో కనిపించనున్నారు. అయితే జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్‌ మేకప్‌తో చిరంజీవి గుండు లుక్‌ని మౌల్డ్‌ చేశారు టెక్నీషియన్స్‌. ఆ వీడియోను చిరంజీవి షేర్‌ చేసి, నిపుణుల పని తీరుని మెచ్చుకున్నారు కూడా. ఇక మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్‌లో గుండుతో కనిపిస్తారట. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా కథానాయికగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్‌ చేస్తున్నారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 11న ఈ చిత్రం విడుదల కానుంది.

నిధిని కాపాడే బర్రోజ్‌
ఒక నిధిని కాపాడే పని మీద ఉంటాడు బర్రోజ్‌. వాస్కోడగామా దాచిన నిధి అది. వాస్కోడగామా నిజమైన వారసునికి మాత్రమే ఆ సంపద దక్కాలి. వారికి నిధిని అప్పగించే బాధ్యతను తీసుకున్న బర్రోజ్‌ 400 ఏళ్లుగా ఆ నిధిని కాపాడుకుంటూ వస్తాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్‌’. టైటిల్‌ రోల్‌లో నటిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మోహన్‌ లాల్‌. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్‌ గెటప్‌ ఈ సినిమాలో డిఫరెంట్‌గా ఉంటుంది. బాలల చిత్రంలా రూపొందిస్తున్నారనీ, పెద్దలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. భారతీయ తొలి త్రీడీ చిత్రం ‘మై డియర్‌ కుట్టి సైతాన్‌’ దర్శకుడు జీజో పున్నూస్‌ ఈ త్రీడీ ‘బర్రోజ్‌’కి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ ఏడాది ఓనమ్‌ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

యాభైయ్యవ సినిమాలో గుండుతో...
నటుడిగా కెరీర్‌లో 50వ మైల్‌ స్టోన్‌ చేరుకున్నారు ధనుష్‌. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే డైరెక్టర్‌గా ఆయనకిది తొలి చిత్రం కాదు. దర్శకుడిగా ‘పవర్‌ పాండీ’ (2017) మొదటి చిత్రం. ఆ చిత్రంలో ఓ అతిథి పాత్ర కూడా చేశారు. ఐదేళ్ల తర్వాత ధనుష్‌ మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టారు. ఈ చిత్రంలో గుండుతో కనిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఆరంభమైంది. చిత్రీకరణ ఆరంభించక ముందు తిరుమల వెళ్లి ధనుష్‌ తలనీలాలు సమర్పించుకున్నారు. ఎలానూ ఈ చిత్రంలో గుండుతో కనిపిస్తారు కాబట్టి దైవాన్ని దర్శించుకుని, తల నీలాలు సమర్పించి ఉంటారని కోలీవుడ్‌ అంటోంది. ఇది గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్‌జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్‌. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement