Chiranjeevi: కొత్త హంగులతో.. మళ్లీ థియేటర్లోకి ఒకప్పటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు

Chiranjeevi Gharana Mogudu, Pawan Kalyan Jalsa Re Release In Theatres - Sakshi

‘ఏదీ... కొంచెం ఫేస్‌ లెఫ్ట్‌కి టర్నింగ్‌ ఇచ్చుకో’ అంటూ ‘ఘరానా మొగుడు’లో చిరంజీవి, ‘ఎవడు కొడితే మైండ్‌ బ్లాంక్‌ అవుద్దో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’లో మహేశ్‌బాబు మాస్‌గా రెచ్చిపోతే ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఈ చిత్రాలను మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూసే చాన్స్‌ రావడం ఫ్యాన్స్‌కి పండగే. ఒకప్పటి సూపర్‌ హిట్‌ సినిమాలను ‘నేడే చూడండి.. మళ్లీ విడుదల’ అంటూ రీ రిలీజ్‌ చేసే కొత్త ట్రెండ్‌ వల్ల ఆ చాన్స్‌ దక్కుతోంది. ఇక ఆ విశేషాల్లోకి వెళదాం... 

మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘పోకిరి’ (2006) పలు రికార్డులు సాధించింది. సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇటీవల మహేశ్‌బాబు బర్త్‌డే (ఆగస్ట్‌ 9) సందర్భంగా రిలీజ్‌ చేస్తే మళ్లీ రికార్డ్‌ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో సింగిల్‌ షో రిలీజ్‌ చేస్తే.. టికెట్స్‌ భారీగా అమ్ముడుపోయాయి. థియేటర్లు కూడా పెంచాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఈ చిత్రం రికార్డ్‌ సాధించింది. 4కె (ఆల్రెడీ ఉన్న పిక్సెల్స్‌ దాదాపు నాలుగు రెట్లు పెరుగుతాయి. వీడియో మరింత స్పష్టంగా కనబడుతుంది.. 4కె వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి) హంగులతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదనే పరిస్థితుల్లో ఈ సినిమాకి వచ్చిన ఆదరణ ఇండస్ట్రీకి బూస్ట్‌ అయింది. దాంతో పాటు ఇటీవల విడుదలైన స్ట్రయిట్‌ చిత్రాలు ‘బింబిసార, సీతారామం, కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం’కి లభించిన ఆదరణ ఇండస్ట్రీకి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో పలు స్ట్రయిట్‌ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘పోకిరి’లా కొత్త హంగులతో మళ్లీ రిలీజ్‌ కాబోయే చిత్రాలు కొన్ని రెడీ అవుతున్నాయని తెలిసింది. వాటిలో ముందు వరుసలో ‘ఘరానా మొగుడు’ ఉంది. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఘరానా మొగుడు’ (1992) సూపర్‌ డూపర్‌ హిట్‌.

ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని కొత్త హంగులతో రీ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ‘బంగారు కోడి పెట్ట..’ అంటూ చిరు వేసిన మాస్‌ స్టెప్పులు మళ్లీ చూసే చాన్స్‌ వస్తే... అభిమానులకు ఆనందమే కదా. ఈ నెలలోనే నాగార్జున పుట్టినరోజు (ఆగస్ట్‌ 29) కూడా.  నాగార్జున నటించిన చిత్రాల్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అయిన ‘శివ’ (1989)ను కూడా 4కె వెర్షన్‌కి మార్చి మళ్లీ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని సమాచారం. సిల్వర్‌ స్క్రీన్‌పై మళ్లీ సైకిల్‌ చైన్‌ సందడిని చూడొచ్చన్న మాట. ఇవే కాదు.. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘జల్సా’ కూడా రీ రిలీజ్‌ కానుందట. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జల్సా’ (2008). సెప్టెంబర్‌ 2న పవన్‌ కల్యాణ్‌ బర్త్‌ డేకి ఈ చిత్రం రిలీజ్‌ కానుందని టాక్‌. ఇంకా ఒకప్పటి సూపర్‌ హిట్‌ సినిమాలు మళ్లీ విడుదలయ్యే అవకాశం ఉంది. 

రంగుల బజార్‌
తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘మాయాబజార్‌’ (1957) ఎవర్‌ గ్రీన్‌. ఒకరితో మరొకరు పోటీపడ్డారా అన్నట్లు ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు తదితర తారల అద్భుత నటనతో కేవీ రెడ్డి దర్శకత్వంలో ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ క్లాసిక్‌ని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. భావితరాలకు ఈ చిత్రాన్ని చూపించాలనే ఆకాంక్షతో రంగులద్ది ఈ దృశ్యకావ్యాన్ని గోల్డ్‌స్టోన్‌ సంస్థ 2010లో విడుదల చేసింది. సో.. రీ రిలీజ్‌ అనేది పన్నెండేళ్ల క్రితమే ఉంది.   

రిలీజ్‌కి రెడీ అవుతున్న ఏయన్నార్‌ ‘ప్రతిబింబాలు’
దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’ చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్‌గా నటించారు. జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. 1982లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏయన్నార్‌ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 20న రిలీజ్‌ చేయనున్నారు.

ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘వియ్యాలవారి కయ్యాలు, ఒక దీపం వెలిగింది, శ్రీ వినాయక విజయం, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు’ వంటి సినిమాలను నిర్మించాను. అయితే ఏయన్నార్‌గారితో నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమాని  కొన్ని దుష్పరిణామాల వల్ల విడుదల చేయలేకపోయాను. ఇప్పుడు లేటెస్ట్‌ టెక్నాలజీని మిళితం చేసి, సరికొత్త హంగులతో విడుదల చేస్తున్నాను. నా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top