4 రోజుల్లో ముంబైని వీడనున్న కంగన!?

BMC Gives Exemption For Kangana Ranaut From Home Quarantine Rule - Sakshi

కంగనకు హోం క్వారంటైన్‌ నిబంధనల నుంచి మినహాయింపు

ముంబై: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో బుధవారం మహారాష్ట్రకు వచ్చిన బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌కు హోం క్వారంటైన్‌ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చినట్లు బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారి వెల్లడించారు. వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే తాను ముంబై నుంచి వెళ్లిపోతానని కంగన, ఆన్‌లైన్‌ దరఖాస్తులో స్పష్టం చేశారని, కాబట్టి షార్ట్‌-టర్మ్‌ విజిటర్‌ కేటగిరీ కింద ఆమెకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 14న కంగన ముంబైని విడిచివెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. (చదవండి: నా ఇంటిని కూల్చారు.. రేపు మీ అహంకారం కూలుతుంది)

కాగా నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు నేపథ్యంలో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ మాఫియా గురించి గళమెత్తిన కంగనాకు ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు రక్షణ కల్పించాలని బీజేపీ నేత రామ్‌ కదమ్‌ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ మాఫియా కంటే తనకు ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయమని, వారికి బదులుగా హిమాచల్‌ ప్రదేశ్‌ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలంటూ కంగన వరుస ట్వీట్లు చేశారు. ఇందుకు స్పందనగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ఘాటు విమర్శలకు బదులిస్తూ.. ముంబై ఏమైనా పాక్‌ ఆక్రమిత కశ్మీరా అంటూ తీవ్రస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరింది. (చదవండి: క్వీన్‌’ ఆఫీస్‌లో కూల్చివేతలు)

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్‌ విసిరిన కంగన.. తన మాటను నిలబెట్టుకుంటూ భారీ బందోబస్తు నడుమ దేశ వాణిజ్య రాజధానిలో అడుగుపెట్టారు. అయితే కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ఆమె 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని బీఎంసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో కంగన దరఖాస్తు మేరకు ఆమెకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తాజాగా తెలిపింది.

ఇదిలా ఉండగా.. కంగనకు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ అధికారులు బుధవారం కూల్చివేతకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డ కంగన.. ముంబై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కంగన బిల్డింగ్‌లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది. దురుద్దేశంతోనే బీఎంసీ ఈ పని చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ఆరంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురవారానికి వాయిదా వేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top