
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్‌స్టోరీ చెప్పాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
సంజనాది శాడిజం: హరీశ్
సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ను హౌస్‌మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్‌ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.
నాలుగో కెప్టెన్
తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్‌మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ.
మోసపోయానని బాధ
నన్ను గేమ్‌లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.
చూడకుండానే లవ్
తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్‌సిరీస్ హీరోహీరోయిన్ హౌస్‌లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్‌లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు.
తనకోసం కప్పు గెలుస్తా..
చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్‌బాస్‌కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్‌లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్‌కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.