
హీరోయిన్ నయనతార (Nayanthara) దేవతగా నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2020లో విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మూకుత్తి అమ్మన్–2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో నయనతార అమ్మవారిగా నటిస్తున్నారు. ఐసరి గణేష్ తన వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. పార్ట్–1 కంటే మరింత భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్–2 షూటింగ్ గత మార్చి నెలలో ప్రారంభమైంది.
నయనతార, కమర్షియల్ దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. విజయదశమి పండుగ సందర్భంగా గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అమ్మవారి గెటప్‌లో ఉన్న నయనతార పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్‌ను తెలుగులో మహాశక్తి పేరిట విడుదల చేయనున్నారు.