Bhala Thandanana Movie Review: భళా తందనాన మూవీ ఎలా ఉందంటే..

Bhala Thandanana Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: భళా తందనాన
నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్‌, గరుడ రామ్‌, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు
దర్శకుడు: చైతన్య దంతులూరి
కథ, డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా
సంగీతం: మణిశర్మ
బ్యానర్‌: వారాహి చలనచిత్రం
నిర్మాత: రజనీ కొర్రపాటి
సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు
ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌
విడుదల తేది: మే 6, 2022

కొత్తదనం అంటే చాలు రంకెలేస్తాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. డిఫరెంట్‌ కాన్సెప్టులకు తివాచీ పరుస్తాడు. సినిమా హిట్టా? ఫట్టా అని కాకుండా అది ప్రేక్షకుడి మనసును హత్తుకుందా? లేదా? అన్నదాని మీదే ఎక్కువగా దృష్టి పెడతాడు. అంతేకాదు, తెలుగు భాషపై మమకారంతో తన సినిమాలన్నింటికీ దాదాపు తెలుగు టైటిల్స్‌ ఉండేలా చూసుకుంటాడు. అలా అన్నమయ్య కీర్తనలో ఉన్న భళా తందనానా అనే పదాన్ని తీసుకుని అదే టైటిల్‌తో సినిమా చేశాడు. ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. మరి ఈ మూవీ శ్రీవిష్ణుకి విజయాన్ని అందించిందా? తన సినిమాతో ప్రేక్షకుడికి కొత్తదనం పంచాడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

Bhala Thandanana Movie Review In Telugu

భళా తందనాన ​​​కథేంటంటే..
శశిరేఖ(కేథరిన్‌) ఓ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. ఓ అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకొని.. ఆ న్యూస్‌ కవర్‌ చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ అనాథాశ్రమ అకౌంటెంట్‌ చందు అలియాస్‌ చంద్రశేఖర్‌(శ్రీవిష్ణు)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్‌ ఆనంద్‌ బాలి(గరుడ రామ్‌) మనుషులు కావడంతో.. ఈ కేసుని సీరియస్‌ తీసుకొని స్టడీ చేస్తుంది శశిరేఖ. ఈ క్రమంలో ఆనంద్‌ బాలి దగ్గర ఉన్న రూ.2000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్తను తన మీడియా సంస్థలో ప్రచురించి ప్రపంచానికి తెలియజేస్తుంది శశిరేఖ. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ రూ.2000 కోట్లను దొంగిలించిదెవరు? ఈ దొంగతనం కేసుతో చందుకి ఉన్న సంబంధం ఏంటి?అనేదే మిగతా కథ

ఎలా ఉందంటే.. 
బాణం, బసంతి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి.. చాలా గ్యాప్‌ తర్వాత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో ‘భళా తందనాన’ తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. క్రైమ్‌ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్‌ చేసి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సినిమాకు కాస్త మైనస్‌ అయింది. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్‌ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్‌ ట్రాక్‌ కారణంగా రొటీన్‌ సినిమాగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ కిడ్నాప్‌ జరగడం..దానిని కనెక్ట్‌ చేస్తూ అసలు కథను ప్రేక్షకులకు చెప్పడంతో దర్శకుడు సఫలమయ్యాడు.

వరుస హత్యలు.. హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌తో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. పాట రూపంలో హీరో చెప్పే లవ్‌ ఫెయిలర్‌ స్టోరీ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథంతా రూ. 2000 కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. ఆ డబ్బుతో చందుకు ఉన్న సంబంధం ఏంటి? అది ఎక్కడా దాచారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలుగుతుంది. క్లైమాక్స్‌ కొత్తగా ఉన్నప్పటికీ.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు? అతని గతం ఏంటి? రూ. 2000 కోట్లు ఎక్కడ దాచాడు? అనే విషయాలను తెలియజేయకుండా.. రెండో భాగం ఉందని చెప్తూ కథని ముగించాడు. ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా.. క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా సాగుతుంది.

ఎవరెలా చేశారంటే...
ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో శ్రీవిష్ణు నటనలో పరిణితి కనిపించింది. ఇక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా కేథరిన్‌ మెప్పించే ప్రయత్నం చేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేథరిన్‌.. తెరపై కాస్త బొద్దుగా కనిపించింది. ఇక ఈ సినిమాకు ఆమే డబ్బింగ్‌ చెప్పుకుంది. అయితే అది కాస్త నప్పలేదు. ‘మేడమ్‌ మీరు మాట్లాడే తెలుగు.. ఇంగ్లీష్‌లా ఉంటుంది’అని హీరోతో ఓ డైలాగ్‌ చెప్పించి.. ప్రేక్షకులను కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేశారు. ఇక విలన్‌గా గరుడ రామ్‌ మెప్పించాడు. అయితే అతనికి బలమైన సీన్స్‌ లేకపోవడం మైనస్‌. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి ఒదిగిపోవడమే కాకుండా..తనదైన కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ, తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధానబలం మణిశర్మ సంగీతం.తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సురేశ్‌ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.  

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top