Ashneer Grover: కియారాతో పెళ్లి అనగానే నా భార్య విడాకుల దాకా వెళ్లింది!

Ashneer Grover Reveals How Kiara Advani Almost Got Him Divorce - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ మరికాసేపట్లో ఏడడుగులు వేయనున్నారు. జైసల్మీర్‌లో ఎంతో ఘనంగా జరగనున్న వీరి వివాహానికి సెలబ్రిటీలందరూ విచ్చేశారు. ఈ వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో వ్యాపారవేత్త, భారత్‌పే సహవ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ తన ఆటోబయోగ్రఫీ డోగ్లాపన్‌లో రాసుకొచ్చిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పుస్తకంలో అష్నీర్‌.. కియారా వల్ల నేను విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది అంటూ ఓ సంఘటనను పంచుకున్నాడు.

అందులో ఏం రాసి ఉందంటే.. 'నేను వీకెండ్‌ రాగానే షార్క్‌ ట్యాంక్‌ ప్రోగ్రామ్‌ కోసం షూటింగ్‌కు వెళ్తున్నాను. మిగిలిన రోజులు నా పనిలో మునిగి తేలుతున్నాను. అలా పనిలో పడి బిజీ అయిపోవడంతో కనీసం అమ్మతో మాట్లాడేంత సమయం కూడా దొరకలేదు. దీంతో ఓ రోజు అమ్మ వచ్చి చాలా పెద్దవాడివైపోయావురా, మాటలు కాదు కదా కళ్లకు కూడా కనిపించట్లేదు అంది. అదే రోజు ఉదయం ఓ స్నేహితుడు కలవడంతో నా భార్య మాధురి, నేను పెళ్లెప్పుడు అని ఆరా తీశాం. ఓ సినీతారతో పెళ్లి సంబంధం కుదిరే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతడు చెప్పాడు.

ఇలా సెలబ్రిటీలతో సంబంధాలు కుదిర్చేందుకు ఓ మధ్యవర్తి పని చేస్తుందన్నాడు. తనొక స్టార్టప్‌ బిజినెస్‌ వ్యవస్థాపకుడు.. కానీ అమ్మాయి మాత్రం సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కావాలని కోరుకుంటున్నాడు. ఇది గుర్తొచ్చి మా అమ్మతో నీకు బయట ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పటికిప్పుడు నేను పెళ్లికి రెడీ అయితే కియారా అద్వానీని వివాహం చేసుకోవచ్చు తెలుసా? అని జోక్‌ చేశాను. అది విని మాధురి ముఖం మాడిపోయింది.

తర్వాత మేమిద్దరం ముంబైకి వెళ్లేందుకు విమానం ఎక్కాం. తను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. ఇంతలో ఫుడ్‌ రావడంతో తినమని ఆమెను పలకరించాను. అంతే.. ఒక్కసారిగా నా మీద అరిచేసి తిట్టినంత పని చేసింది. నువ్వు కియారాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయితే నేనెందుకు మరి అంటూ తన నగలన్నీ తీసేసింది. ఆమె చర్యతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. దయచేసి అలా ప్రవర్తించొద్దంటూ ఆమెను నగలు తీసేయకుండా పట్టుకున్నాను. అప్పటిదాకా ఫోన్‌లో సినిమా చూస్తున్న ఓ పెద్దాయన వెంటనే దాన్ని ఆపేసి లైవ్‌లో మా ఫైట్‌ మూవీని చూస్తున్నాడు. అక్కడున్న అందరికీ ఈ గొడవంతా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌లా అనిపించింది' అని రాసుకొచ్చాడు అష్నీర్‌.

చదవండి: స్టేజీపై పాట పాడిన ధనుష్‌.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top