మ్యాజిక్‌ జరిగింది | Sakshi
Sakshi News home page

మ్యాజిక్‌ జరిగింది

Published Thu, Dec 17 2020 5:57 AM

Arvind Swami is all swagger as MGR in Thalaivi - Sakshi

కాల్పనిక పాత్రలు చేయడం సులువు అనలేం కానీ నిజజీవిత పాత్రలు చేయడంలో ఉన్న కష్టం అయితే కచ్చితంగా ఉండదు. ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు హావభావాలు, నడక, మాట... అన్నీ వారినే తలపించేలా ఉండాలి. అందుకే పురట్చి తలైవర్‌ (విప్లవ నాయకుడు) ఎంజీఆర్‌ పాత్ర ఒప్పుకున్నప్పుడు అరవింద్‌ స్వామి చాలా కసరత్తులు చేశారు. చివరికి ‘డెంటిస్ట్‌’ దగ్గరకు వెళ్లి తన పళ్లు ఎన్టీఆర్‌ పళ్లకి మ్యాచ్‌ అయ్యేలా ఉన్నాయా? అని కూడా చెక్‌ చేసుకున్నారంటే ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో ఊహించవచ్చు.

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కించిన ‘తలైవి’లో దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ పాత్రను చేశారు అరవింద్‌ స్వామి. ఈ పాత్ర చిత్రీకరణ మంగళవారంతో పూర్తయింది. ‘‘చివరిసారిగా నన్ను పురట్చి తలైవర్‌ అందానికి దగ్గరగా తన పనితనంతో మ్యాజిక్‌ చేస్తున్న రషీద్‌కి ధన్యవాదాలు’’ అంటూ మేకప్‌ చేయించుకుంటున్న ఫొటోను షేర్‌ చేశారు అరవింద్‌ స్వామి. జనవరి 17న ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్‌ స్వామి లుక్‌కి మంచి స్పందన లభించింది. అరవింద్‌ స్వామి అన్నట్లు మేకప్‌ ఆర్టిస్ట్‌ పట్టణమ్‌ రషీద్‌ మ్యాజిక్‌ చేశారు. ‘తలైవి’గా కంగనా రనౌత్‌ నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement