Arjuna Phalguna Review: ‘అర్జున ఫల్గుణ’ మూవీ రివ్యూ

Arjuna Phalguna Movie Review - Sakshi

టైటిల్‌ : అర్జున ఫల్గుణ
నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌, నరేశ్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్‌, ‘రంగస్థలం’మహేశ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ :  మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 
దర్శకత్వం : తేజ మార్ని
సంగీతం : ప్రియ‌ద‌ర్శ‌న్
సినిమాటోగ్రఫీ : జ‌గ‌దీష్ చీక‌టి
విడుదల తేది : డిసెంబర్‌ 31,2021

వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. .. విలక్షణ నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ టాలెంటెండ్‌ హీరో.. తాజాగా ‘అర్జున ఫల్గుణ’అంటూ మరో డిఫరెంట్‌ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అర్జున ఫల్గుణ’ఏ మేరకు అందుకుంది? రివ్యూలో చూద్దాం. 

‘అర్జున ఫల్గుణ’కథేంటంటే..?
డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్‌ కుమార్‌), తాడి(‘రంగస్థలం’మహేశ్‌), ఆస్కార్(చైత‌న్య గ‌రికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్‌)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్‌ఫ్రెండ్స్‌. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్‌ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్‌కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్‌ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. 

(రాజ్‌కుమార్

ఎలా చేశారంటే..?
ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు యాక్టింగ్‌ ఇరగదీశాడు. సినిమా మొత్తాన్ని తన  భుజాన మోసుకొచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్నిచోట్ల నవ్వించాడు. ఇక శ్రీవిష్ణుకు జతగా శ్రావణి పాత్రలో అమృత అయ్యర్‌ మంచి నటనను కనబర్చింది. పల్లెటూరి అమ్మాయిలా తెరపై అందంగా కనబడింది. హీరో స్నేహితులుగా రంగస్థలం మహేశ్‌తో పాటు మిగిలిన ఇద్దరు కూడా చక్కగా నటించారు. ఇక కన్నింగ్‌ కరణంగా నరేశ్‌, రైతుగా దేవీ ప్రసాద్‌, హీరో తండ్రిగా శివాజీ రాజా తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. పోలీసాఫిసర్‌గా సుబ్బరాజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే.. 
సినిమాలో హీరో ఎంత బాగా నటించినా కూడా.. కథ, కథనం బాగుంటేనే అది సక్సెస్‌ అవుతుంది. రొటీన్‌ కథనైనా.. దాన్ని తెరపై వైవిధ్యంగా చూపిస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ తగ్గట్టు సినిమాని డ్రైవ్‌ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ విషయంలో కొత్త దర్శకుడు తేజ మార్ని తడబడ్డాడు. తొలి సినిమా ‘జోహార్‌’తో మంచి మార్కులు కొట్టేసినా తేజ.. ‘అర్జున ఫల్గుణ’మూవీని సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయాడు. కథ, కథనం రెండూ రోటీన్‌గా ఉన్నాయి.  గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురి నిరుద్యోగుల నేపథ్యాన్ని కథాంశంగా మలచుకొని ‘అర్జున ఫల్గుణ’సినిమాన్ని తెరకెక్కించాడు.

అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం రోటీన్‌గా చూపించడం సినిమాకు మైనస్‌. ఫస్టాఫ్‌లో కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేసినా.. సెకండాఫ్‌ పూర్తిగా తేలిపోయింది. ప్రేక్షకుడి ఊహకందే విధంగా కథనం సాగుతుంది. ఎమోషనల్‌ సీన్స్‌ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌, లవ్‌, పల్లెటూరి చమత్కారం.. ఇలా కథలో జొప్పించడానికి చాలా ఆప్షన్స్‌ ఉన్నప్పటికీ.. వాటిని చేచేతూలా చేజార్చుకున్నాడు. అర్జుణుడు, అభిమన్యుడు, పద్మవ్యూహం అంటూ పెద్ద పెద్ద పదాలతో కథను ప్రారంభించిన దర్శకుడు.. చివరకు గమ్యంలేని ప్రయాణంలా మార్చేశాడు. అయితే సుధీర్‌ వర్మ డైలాగ్స్‌ మాత్రం సినిమాకు చాలా ప్లస్‌ అయ్యాయి. ప్రియదర్శన్‌ సంగీతం కొంతమేర ఆకట్టుకున్నా.. కొన్ని చోట్ల  బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అతిగా అనిపిస్తుంది. జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కథలను ఎంచుకోవడంతో దిట్ట అయినా శ్రీవిష్ణువు.. ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త బోల్తా పడ్డాడనే చెప్పాలి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top