ఈ మధ్య సోషల్ మీడియాలో సీటీ నటులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు షేర్ చేసే ఫోటోలపై బూతు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది తారలు వీటిని పట్టించుకోవడం లేదు. వారి కామెంట్స్‌పై స్పందిస్తే..మరింత ట్రోల్ చేస్తారని.. లైట్ తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు కొంతమంది ఆకతాయిలకు బలంగా మారింది. ఎలాంటి కామెంట్స్ పెట్టినా.. పట్టించుకోరని ఇష్టం వచ్చినట్లుగా, పచ్చి బూతులతో కామెంట్స్ పెట్టి శునకానందం పొందుతున్నారు. అయితే అలాంటి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది కన్నడ నటి చైత్ర. తనపై వల్గర్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు గట్టి బుద్ది చెప్పింది.
పోలీసు డ్రెస్ డీపీతో..
సప్తసాగరాలు దాటి, 3బీహెచ్‌కే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర జే ఆచార్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోపై పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఫోటోని ప్రొఫైల్ పిక్చర్, ‘@hosamani53’ అనే హ్యాండిల్‌తో ఉన్న ఆ అకౌంట్ నుంచి ‘అసలు నువ్వు హీరోయిన్‌వా లేక సె** వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో’ అంటూ కన్నడ భాషలో అసభ్య పదజాలంతో కామెంట్ చేశారు. ఈ కామెంట్‌ని చైత్ర స్క్రీన్‌షాట్ తీసి.. సోషల్ మీడియా వేదికగా బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీసులు.. ఈ అకౌంట్ మీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిదే అనుకుంటా. దయచేసి ఇతనికి మీరే సమాధానం చెప్పగలరా?’ అని సింగర్ చైత్ర ప్రశ్నించారు.

భయపడి క్షమాపణలు
చైత్ర చేసిన పోస్ట్‌తో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. సదరు ప్రొఫైల్ పిక్చర్‌లో ఉన్న వ్యక్తి నిజంగానే పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడా? లేక ఖాకీ యూనిఫామ్ ఫోటో పెట్టుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడా? అనే కోణంలో అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలిసి సదరు నెటిజన్ వెంటనే తాను పెట్టిన కామెంట్‌ని డిలీట్ చేశాడు. అంతేకాదు కామెంట్ సెక్షన్‌లోనే నటి చైత్రకు క్షమాపణలు చెబుతూ మెసేజ్ పెట్టాడు.
ఈ విషయమై ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇలాంటి అసభ్య కామెంట్లు పెట్టడం నేరమే. అయితే సదరు వ్యక్తి మా డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదు, కానీ సదరు వ్యక్తి తన తప్పు తెలుసుకుని నటికి క్షమాపణలు చెప్పాడు’అని స్పష్టం చేశారు.


