Anubhavinchu Raja Review: ‘అనుభవించు రాజా’ ఎలా ఉందంటే..?

Anubhavinchu Raja Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : అనుభవించు రాజా
నటీనటులు : రాజ్ త‌రుణ్‌, క‌షీష్ ఖాన్‌, పోసాని కృష్ణ ముర‌ళి, ఆడుగ‌ల‌మ్ న‌రేన్‌, అజ‌య్‌, సుద‌ర్శ‌న్‌, టెంప‌ర్ వంశీ, అరియానా తదితరులు
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
నిర్మాత :   సుప్రియ యార్లగడ్డ
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి 
సంగీతం :  గోపీసుంద‌ర్
సినిమాటోగ్రఫీ :  న‌గేశ్ బానెల్‌
ఎడిటింగ్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
విడుదల తేది : నవంబర్‌26, 2021

యంగ్‌ హీరో రాజ్ తరుణ్ ఓ సాలిడ్‌ హిట్‌గా చాలా కష్టపడుతున్నాడు. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజ్‌ తరుణ్‌..ఆ తర్వాత ఆ హవాను కొనసాగించడంలో విఫలమం అయ్యాడు. ఇప్పటి వరకు ఆయన డజన్‌కు పైగా చిత్రాలు చేసినప్పటికీ.. కెరీర్ మొద‌ట్లో వ‌చ్చిన ఉయ్యాల జంపాల‌, కుమారి 21 ఎఫ్ మాత్ర‌మే హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి.  దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో ‘అనుభ‌వించు రాజా’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు.. సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ శుక్రవారం(నవంబర్‌ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనుభవించు రాజా’ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

‘అనుభవించు రాజా’ కథేంటంటే
పశ్చిమగోదావరి జిల్లా యండగండికి చెందిన బంగార్రాజు అలియాస్‌ రాజ్‌ (రాజ్‌ తరుణ్‌) పూర్వికులు కోటీశ్వరులు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటకీ.. రాజ్‌ మాత్రం సొంత ఊరిని వదిలి హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం చేస్తుంటాడు. ఇదే సమయంలో అతన్ని హత్య చేసేందుకు గని గ్యాంగ్‌కు ఓ వ్యక్తి పెద్ద ఎత్తున సుపారీ ఇస్తాడు. అసలు రాజ్‌ హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కోట్ల ఆస్తులకు అధిపతి అయిన రాజ్‌..సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం ఎందుకు చేశాడు? అతను గ్రామం నుంచి పారిపోవడానికి గల కారణాలేంటి? అనేదే మిగతా కథ

ఎవరెలా చేశారంటే...
జల్సారాయుడు లాంటి బంగార్రాజు పాత్రలో రాజ్‌ తరుణ్‌ ఒదిగిపోయాడు. తనదైన కామిక్ టైమింగ్, ఎగతాళితో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఊర్లో అవారాగా తిరిగే బంగార్రాజుగా, సిటీలో సిన్సియర్‌గా సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం చేసే రాజ్‌గా రెండు విభిన్న పాత్రలో కనిపించిన రాజ్‌ తరుణ్‌.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ కషీష్‌ ఖాన్‌ తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటీ.. ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక గ్రామ ప్రెసిడెంట్‌గా ఆడుగ‌ల‌మ్ న‌రేన్‌, సెక్యూరిటీ గార్డ్స్‌ హెడ్‌గా పోసాని మెప్పించారు. హీరో ఫ్రెండ్‌గా నటించిన సుదర్శన్‌.. తనదైన పంచ్‌లతో నవ్వించాడు. అజయ్‌, అరియానా, రవిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
శ్రీను గవిరెడ్డి, రాజ్‌ తరుణ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే  ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ’అనే మూవీ వచ్చింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే  ఈ సారి మాత్రం రాజ్‌ తరుణ్‌కు అచ్చొచ్చిన కామెడీ జానర్‌లో ‘అనుభవించు రాజా’తో మరో ప్రయత్నం చేశాడు దర్శకుడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించామంటూ.. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మొదటి నుంచి దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అయితే సినిమాలో మాత్రం మరీ పగలబడి నవ్వేంత సీన్స్‌ మాత్రం ఏమీ ఉండవు. ఫస్టాఫ్‌ అంతా హైదరాబాద్‌లో హీరోగా సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేయడం,అక్కడే హీరోయిన్‌తో ప్రేమలో పడడం లాంటి సన్నివేశాలతో ముగించిన దర్శకుడు.. ఇంటర్వెల్‌ ముందు ఓ ట్విస్ట్‌ ఇచ్చి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచేలా చేశాడు. ఇక సెకండాఫ్‌ మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగుంది. అక్కడ కామెడీకి మరింత స్కోప్‌ ఉన్నప్పటికీ.. రోటీన్‌గానే కథను నడిపించారు.  ప్రెసిడెంట్‌ ఎన్నికల సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోవు. రోటీన్‌ కామెడీ సీన్స్‌తో లాగించాడు. అయితే ప్రెసిడెంట్‌ కుటుంబంలో జరిగే హత్య వెనుక ఉన్నదెవరనేది మాత్రం ప్రేక్షకుడికి ఆసక్తిరేకెత్తించేలా తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే... గోపీసుంద‌ర్ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. న‌గేశ్ బానెల్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఊహించనంత గొప్ప సినిమా అయితే కాదనే చెప్పాలి. 

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top