ఏడేళ్ల తర్వాత తొలి సంతానం.. బుడ్డోడి పేరేమిటంటే!

Anita Hassanandani Baby Boy Name Revealed By Bharti Singh - Sakshi

ముంబై: నటి అనిత హసానందాని మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. తన బుజ్జాయిని చూసి మురిసిపోతూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు గల సంతోషకర క్షణాలను వీడియోలో బంధిస్తూ అనిత అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన కొడుకు పేరిట  స్నేహితులకు బహుమతులు పంపించారు. ఈ కానుక అందుకున్న వారిలో బాలీవుడ్‌ కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ క్రమంలో అనిత- రోహిత్‌రెడ్డి దంపతుల తనయుడి పేరు బహిర్గతమైంది. ‘‘ఆరవ్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్రెండ్‌ రిక్వెస్టులు ఆక్సెప్ట్‌ చేస్తున్నాడు’’అని రాసి ఉన్న గిఫ్ట్‌ప్యాక్‌ను భారతీ ఇన్‌స్టా స్టోరీలో రివీల్‌ చేశారు. దీంతో చిన్నారి పేరు ఎంతో బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆరవ్‌ పేరిట అతడి తల్లిదండ్రులు ఇప్పటికే ఓ ఇన్‌స్టా పేజ్‌ను క్రియేట్‌ చేశారు. కాగా ‘‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అనిత‌ తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించారు. యే హై మొహబ్బతే, నాగిని వంటి హిట్‌ సీరియల్స్‌లో మెరిశారు. రోహిత్‌రెడ్డి అనే వ్యాపారవేత్తను ప్రేమించిన ఆమె.. 2013లో ఆయనను వివాహం చేసుకున్నారు. పెళ్లైన దాదాపు ఏడేళ్ల తర్వాత, ఫిబ్రవరి 9న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం గురించి అనిత మాట్లాడుతూ.. ‘‘ఇరు కుటుంబాల నుంచి సంతానం కోసం మాపై ఎలాంటి ఒత్తిడి రాలేదు. నాచ్‌ బలియే షో తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకున్నాం.

లాక్‌డౌన్‌లో గర్భం దాల్చాను. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత సహజ పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వడం కాస్త కష్టమైన పని అన్నారు. కానీ నా విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. తల్లిదండ్రులుగా మారిన తర్వాత రోహిత్‌, నేను ఆనందంలో తేలిపోతున్నాం. నిజానికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. సరైన ఆహారపుటలవాట్లు, జీవనశైలి పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు’’ అని స్ఫూర్తి నింపారు.  కాగా అనిత ఏప్రిల్‌ 14, 1981లో జన్మించారు. ఆమె వయసు ప్రస్తుతం 39 ఏళ్లు.
చదవండి: ‘అమ్మ పొట్టలో ఎవరున్నారు జాకీ‌.. చెల్లెలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top