
ఆ హీరో సినిమాకు వచ్చిన వసూళ్లని ఈ హీరో అధిగమించాడు. అతడి కంటే ఇతడు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడంతా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ ఒకప్పుడు రికార్డులు అంటే వేరే ఉండేవి. అంతెందుకు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించాడు. ఆయన 100వ జయంతి సందర్భంగా అలాంటి ఓ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
ట్రాజెడీ కింగ్ ఏఎన్నార్
ఫైట్స్ ఎవరైనా చేస్తారు గానీ ప్రేక్షకుడు గుండెలు కరిగాలే యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏఎన్నార్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎందుకంటే విషాదాంత ప్రేమకథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు. ట్రాజెడీ ప్రేమకథలంటే లైలా-మజ్ను, సలీమ్-అనార్కలీ, దేవదాసు-పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ నటనతో అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు.
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)
ఎప్పటికీ గుర్తుండిపోయే..
లైలా-మజ్ను సినిమాలో అక్కినేని భగ్న ప్రేమికుడిగా బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. ఇది రిలీజైన నాలుగేళ్లకు 'దేవదాసు' చేశారు. ఇది ఏఎన్నార్ కెరీర్‌లోనే సాహసోపోతమైన మైల్ స్టోన్ మూవీ. ఎందుకంటే అప్పటికే 'దేవదాసు' నవల చదివినోళ్లు.. అదే కథతో తీసిన హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన వాళ్లు.. 'దేవదాసు'గా ఏఎన్నార్ ఆకట్టుకోవడం అసాధ్యం అన్నారు. కానీ ఈ మూవీ తన నటజీవితానికి సవాలుగా భావించారు. 'జగమే మాయ..', 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాడుతూ మహానటుడు అనిపించుకున్నారు. తనని విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు.

ఆ రెండింటిలోనూ
పై రెండే కాదు 'అనార్కలి' సినిమాలోని సలీమ్గానూ అక్కినేని యాక్టింగ్ అద్భుతం. దీనితో పాటు పెళ్లి కానుక, సుమంగళి చిత్రాల్లోనూ భగ్న ప్రేమికుడు, త్యాగమూర్తిగా ఆహా అనేలా నటించారు. బాటసారి, మూగమనసులు, రావణుడే రావణుడైతే తదితర సినిమాల్లోనూ ఏఎన్నార్ అదరగొట్టేశారు. 'ప్రేమాభిషేకం' లాంటి విషాదంత ప్రేమకథ అయితే ఎప్పటికీ రాదేమో? అలా టాలీవుడ్ చరిత్రలో ట్రాజెడీ కింగ్‌గా నిలిచిపోయారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)
నవలా నాయకుడు
ఇప్పుడంటే రీమేక్ కథలని మన హీరోలు వెంటపడుతున్నారు. వాటిలోనూ మెప్పించలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్రబంధం, తోడికోడళ్లు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్య భర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు-పెళ్లిళ్లు, ప్రేమనగర్, సెక్రటరీ.. ఇలా ఏఎన్నార్ కెరీర్‌లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాలన్నీ నవలలే కావడం విశేషం.
అటు విషాదాంత ప్రేమకథలైనా.. ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు తన మార్క్ చూపించారు. ఈ రెండు విషయాల్లోనూ ఏఎన్నార్‌ని దాటే హీరో తెలుగులో ఎప్పటికీ రాడు, రాలేడు!
(ఇదీ చదవండి: అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!)