తల్లికి క్యాన్సర్‌.. తీవ్ర రక్తస్రావం.. ఏడ్చేసిన ప్రియాంక | Serial Actress Priyanka Jain Reveals Her Mother Suffers With First Stage Of Cancer, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Priyanka Jain: తల్లికి క్యాన్సర్‌.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ బోరున ఏడ్చిన నటి

Published Wed, Jan 24 2024 1:55 PM

Actress Priyanka Jain Reveals her Mother First Stage of Cancer - Sakshi

జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక జైన్‌. ఈ సీరియల్‌ అయిపోగానే తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో అడుగుపెట్టింది. ఈ షో ద్వారా తాను పొట్టిపిల్లను కాదు గట్టిపిల్లను అని నిరూపించుకుంది. ప్రియుడు శివకుమార్‌తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే అతడిని పెళ్లాడనున్నట్లు కూడా వెల్లడించింది. ప్రియాంక ఇంట పెళ్లిబాజాలు మోగడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఓ విషాద వార్తను పంచుకుందీ బ్యూటీ. తన తల్లికి క్యాన్సర్‌ ఉందని చెప్తూ ఏడ్చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది.

20 రోజుల పాటు రక్తస్రావం..
ప్రియాంక మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే జీవితం చాలా సంతోషంగా ఉండబోతుందనుకున్నాను. ఇంతలోనే అమ్మ ఇలా ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది. అమ్మకు నెలసరిలో ఎక్కువ రక్తం పోతోంది. వరుసగా 15-20 రోజులు బ్లీడింగ్‌ అవుతోంది. ఎప్పుడు పడితే అప్పుడు పీరియడ్స్‌ అవుతున్నాయి. వయసు పైబడేటప్పుడు ఇలాంటి మార్పులు సహజమే అనుకుంది. ఈ మధ్య పరీక్షలు చేయిస్తే తనకు క్యాన్సర్‌ ఫస్ట్‌ స్టేజ్‌లో ఉందని తేలింది. నేను బిగ్‌బాస్‌ షోలో ఉన్న సమయంలోనే తనకు నెలసరిలో సమస్య మొదలైంది.

గర్భాశయం తొలగింపు
కానీ అమ్మ నన్ను సపోర్ట్‌ చేయాలని, బిగ్‌బాస్‌లో నన్ను చూడాలని ఏ ఆస్పత్రికి వెళ్లలేదు. అసలు నేను బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదనిపిస్తోంది. తనకు లాపొరోస్కోపిక్‌ సర్జరీ చేయనున్నారు. తన గర్భాశయాన్ని తీసేస్తామన్నారు. దానివల్ల క్యాన్సర్‌ ఆగిపోయే ఛాన్స్‌ ఉందని వైద్యులు చెప్తున్నారు' అంటూ ఏడ్చేసింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తాన్ని సేకరించి ఆమెకు ఎక్కించారు. అనంతరం ఆమె తల్లిని ఆపరేషన్‌కు తీసుకెళ్లగా ప్రియాంక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత ఆపరేషన్‌ విజయవంతమైందని చెప్పడంతో సంతోషించింది నటి.  ఆమె కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చింది. శరీరంలో ఏదైనా మార్పులు జరుగుతున్నప్పుడు వెంటనే గుర్తించి ఆస్పత్రికి వెళ్లమని సూచించింది ప్రియాంక. తమలాగా ఈ తప్పు ఎవరూ చేయొద్దని కోరింది.

చదవండి: విడాకుల తర్వాత కరీనాతో డేటింగ్‌.. ఆ హీరోయిన్‌ ఇచ్చిన సలహా..

Advertisement
 
Advertisement