ఇంట్లో మృతదేహం.. స్పందించిన హీరోయిన్‌ | Actress Krishi Thapanda Breaks Silence After Man Found Dead At Her Apartment | Sakshi
Sakshi News home page

ఇంట్లో మృతదేహం.. స్పందించిన హీరోయిన్‌

Jun 30 2026 1:51 PM | Updated on Jun 30 2026 2:30 PM

Actress Krishi Thapanda Breaks Silence After Man Found Dead At Her Apartment

బిగ్‌బాస్‌(కన్నడ) ఫేం, నటి కృషి తపండ నివాసంలో ఆమె స్నేహితుడు, వ్యాపారవేత్త వైశాఖ్‌ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జూన్‌ 24న జరగగా.. అప్పటి నుంచి కృషి తపండపై నెట్టింట రకరకాల ప్రచారం జరుగుతోంది. వైశాఖ్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ఆమే కారణం అన్నట్లుగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు.  దీనిపై తాజాగా కృషి తపండ స్పందిస్తూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు అని.. అలాంటి సమయంలో కూడా వ్యక్తిగత గ్యోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

‘ఇలాంటి పోస్ట్‌ చేయాల్సి వస్తుందని అస్సలు ఊహించేలేదు. నాపై వస్తున్న వదంతులకు సమాధానం ఇచ్చేందుకే ఈ పోస్ట్‌ పెడుతున్నా. కొన్ని రోజుల క్రితం నా జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. నా మనసుకు ఎంతో దగ్గరైన, నాకు అన్ని వేళలా అండగా ఉండే మిత్రుడిని కోల్పోయా. అతడి మరణం నాకు తీరని లోటు. 

ఈ బాధలో నేను ఉంటే.. అంతకంటే దారుణమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఓ వ్యక్తి మరణిస్తే.. దానిపై వదంతులు, ఊహాగానాలతో కొందరు తమకు నచ్చిన కథలు సృష్టిస్తున్నారు. నేను కన్పిస్తే చాలు.. ‘మీ స్పందన ఏంటీ?’ అంటూ అర్థం లేకుండా అడుగుతున్నారు. అలాంటి వాళ్లని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఒకరి నష్టాన్ని మీ హెడ్‌లైన్‌గా మార్చుకోకండి. మేమంతా ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ప్రవర్తించొద్దు. మీరు చేసే అసత్య ప్రచారాలు.. బాధలో ఉన్నవారికి మరింత నష్టం కలిగిస్తాయి. మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉండకపోయినా ఫర్వాలేదు.. కానీ ఇంకొకరి కన్నీళ్లకు మీరు కారణం కావొద్దు. నా మిత్రుడి ఆత్మకు శాంతి కలిగేలా ప్రవర్తిస్తారని కోరుకుంటున్నా. ఇకనైనా ఇలాంటి ప్రచారాలు ఆపాలని వేడుకుంటున్నా’అని కృషి తపండ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement