
చెన్నై : ఈ మధ్యకాలంలో షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరగడం తరుచూ చూస్తున్నాం. రిస్క్ అని తెలిసినా డూప్ లేకుండా నటిస్తూ కొందరు యాక్టర్స్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా నాలుగు జాతీయ అవార్డుల గ్రహీత, నటుడు, డైరెక్టర్ చేరన్ సినిమా షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. నంద పెరియాస్వామి దర్శకత్వంలో కడలి ఫేమ్ గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో చేరన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జరుగుతోంది.
ఇందులో భాగంగా ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో చేరన్ ఇంటి పైకప్పు నుంచి కాలు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. దీంతో వెంటనే తేరుకున్న చిత్ర యూనిట్ ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు 8 కుట్లు పడినట్లు సమాచారం. అయితే తన వల్ల షూటింగ్ ఆగిపోవద్దని, వెంటనే హాస్పిటల్ నుంచి నేరుగా సెట్‌కి వచ్చి ఆయన షూటింగులో పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.