కట్టుకున్న భార్య ఆర్తిని కాదనుకున్నాడు. సింగర్ కెనీషాతో ప్రేమలో పడ్డాడు. విడాకులు మంజూరవకముందే ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసరికి జనం ఛీకొట్టారు. విపరీతమైన ఆన్‌లైన్ ట్రోలింగ్ తట్టుకోలేక ప్రేయసి వదిలేసింది. దీంతో ఒంటరివాడైపోయాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి.
పెళ్లి తర్వాత నరకం
ఆ బాధ తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చాడు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు.
నటి వల్ల జీవితం నాశనం
శారీరకంగా, మానసికంగా హింసించి చంపేయాలని చూస్తున్నారని ఆరోపించాడు. మూడక్షరాల ఇడ్లీ నటి తన జీవితాన్ని నాశనం చేసిందన్నాడు. ఈ ఆరోపణలపై ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయకుమార్ స్పందించింది. అతడికి పిల్లల్ని దూరం చేస్తున్నారన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదంది. పైగా 2009లో రవి- ఆర్తిల పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించింది.
బ్లాక్‌మెయిల్ చేసింది అతడే..
ఆమె మాట్లాడుతూ.. '2008లో వికటన్ మ్యాగజైన్‌లో ఓ ఇంటర్వ్యూ వచ్చింది. దానికోసం నేను వెతుకుతున్నాను. అందులో ఆర్తిని పెళ్లి చేసుకోమని బలవంతపెట్టిందెవరు? చేతి మణికట్టు కోసుకుని బ్లాక్‌మెయిల్ చేసిందెవరు? అన్నది స్పష్టంగా ఉంది. తన డబ్బు వాడుకోనిస్తున్నామా? లేదా? అన్నది కోర్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చింది' అని తెలిపింది.
ఆ నటి హస్తం లేదు
రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు సుజాత ఇలా స్పందించింది. 'తమిళనాడులో ఏ మహిళకు అన్యాయం జరిగినా అందరూ మాట్లాడతారు. లక్షలాది మంది ఆర్తి పోస్టులకు కామెంట్లు పెట్టారు. కేవలం ఫలానా వ్యక్తులే ఆర్తి వెంట ఉండి ఇదంతా చేస్తున్నారనడం పూర్తిగా అబద్ధం.
పెళ్లి
ప్రస్తుతం ఈ విడాకుల కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను' అంది. కాగా రవి మోహన్- ఆర్తి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. కాగా రవిమోహన్ దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
చదవండి: త్రిష కోసం ఆ పని చేశా.. చెప్పాలంటే భయంగా ఉంది: చిన్మయి శ్రీపాద


