Aadavallu Meeku Johaarlu Review: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఎలా ఉందంటే?

Aadavallu Meeku Johaarlu Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ఆడవాళ్లు మీకు జోహార్లు
నటీనటులు : శర్వానంద్‌, రష్మిక, ఖుష్భూ, రాధిక, ఊర్వసి, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు
నిర్మాణ సంస్థ :శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
నిర్మాత: ధాకర్​ చెరుకూరి
దర్శకత్వం : శోర్​ తిరుమల
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : సుజిత్‌ సారంగ్‌
ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
విడుదల తేది : మార్చి 04, 2022

యంగ్‌ హీరో శర్వానంద్‌ సాలిడ్‌ హిట్‌ కొట్టి చాలా కాలం అవుతుంది. ‘మహానుభావుడు’ తర్వాత ఆయనకు మరలా సక్సెస్‌ దక్కలేదు. ఇటీవల ఆయన తీసిన ‘శ్రీకారం’, ‘మహాసముంద్రం’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి పక్కా హిట్‌ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు.రష్మిక మందన్నతో కలిసి కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్‌ టాక్‌ రావడంతో పాటు సినిమాపై అంచనాలను క్యూరియాసిటీని పెంచేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 4)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన చిరంజీవి అలియాస్‌ చిరుకి(శర్వానంద్‌)ఏజ్‌ బార్‌ అయినా.. ఇంకా పెళ్లి కాదు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి నచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన లక్ష్యం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన ప్రతి అమ్మాయిని ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్‌ చేస్తారు. దీంతో తన జీవితంలో ఇక ‘మాంగళ్యం తంతునానేనా ’అనే మంత్రాన్ని ఉచ్చరించనేమోనని బాధపడుతున్న క్రమంలో ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆద్యకు కూడా చిరుపై ప్రేమ ఉన్నప్పటికీ.. అతని ప్రపోజ్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. దానికి కారణం తన తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే నచ్చకపోవడం. వకుళను ఒప్పిస్తేనే ఆద్య తనకు దక్కుతుందని భావించిన చిరు.. ఓ చిన్న అబద్దం చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు వకుళకు పెళ్లి అంటే ఎందుకు నచ్చదు? ఆమె నేపథ్యం ఏంటి? చివరకు చిరు, ఆద్యలు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ.

 

ఎవరెలా చేశారంటే.. 
ఉమ్మడి కుటుంబంలో పెట్టి పెరిగిన యువకుడు చిరంజీవిగా శర్వానంద్‌ ఆకట్టుకున్నాడు. వధువు కోసం అన్వేషించి, విసిగిపోయిన ఏజ్‌ బార్‌ బ్యాచిలర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆద్య పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. హీరో తల్లి ఆదిలక్ష్మీగా రాధిక పర్వాలేదనిపించింది. పద్మమ్మగా ఊర్వశి తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. ఇక హీరోయిన్‌ తల్లి వకుళ పాత్రకు ఖుష్భూ న్యాయం చేసింది. సినిమాలో చాలా బలమైన పాత్ర తనది. హీరో స్నేహితుడిగా వెన్నెల కిశోర్‌ ఎప్పటి మాదిరే తనదైన పంచ్‌ డైలాగ్స్‌తో నవ్వించాడు. పెళ్లి కూతురు తండ్రి బుజ్జిగా బ్రహ్మానందం తళుక్కున మెరిసి వెళ్లాడు. మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..
రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు, శర్వానంద్‌ లాంటి టాలెంటెడ్‌ హీరో, రష్మిక లాంటి బ్యూటిఫుల్‌ హీరోయిన్‌.. వీళ్లంతా కలిసి నటించిన చిత్రం కావడంతో తొలి నుంచి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఫ్యూర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ రాకపోవడంతో... ఈ సినిమా కచ్చితంగా ఆ లోటుని తిరుస్తుందని భావించారు అంతా. కానీ ప్రేక్షకుల అంచనాలు కొంతమేర తప్పాయి. సినిమాలో కొత్తదనం కొరవడింది. రోటీన్‌ స్టోరీకి కామెడి, ఎమోషన్స్‌ని జోడించి ‘ఆడవాళ్లు జోహార్లు’సినిమాను తెరకెక్కించాడు కిశోర్‌ తిరుమల. చెప్పుకోవడానికి పెద్ద పేరున్న నటీ,నటులను తీసుకున్నాడు తప్పా.. వారి పాత్రలకు తగిన ప్రాధాన్యత మాత్రం సినిమాలో లేదు. ఉన్నంతలో ఖుష్బు పాత్ర పర్వాలేదు.

గత సినిమాలే మాదిరే సున్నితమైన హాస్యభరితమైన సన్నివేశాలతో ఫస్టాఫ్‌ అంతా కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. పెళ్లి కోసం హీరో పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. అలాగే వెన్నెల కిశోర్‌ కామెడీ కూడా నవ్వులు పూయిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీని వెనక్కినెట్టి.. ఎమోషన్స్‌ని ముందుకు తీసుకోచ్చాడు దర్శకుడు. అయితే అది వర్కౌట్‌ కాలేదు. పాత సినిమాలే మాదిరే.. హీరోయిన్‌ ప్యామిలీని ఒప్పించడానికి హీరో.. హీరోయిన్‌ ఇంటికి వెళ్లడం, క్లైమాక్స్‌లో నిజం తెలిసి పోవడం, చివరకు వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడం.. ఇలానే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’మూవీ సాగుతుంది.

సెకండాఫ్‌లో ప్రతి చోట.. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ‘నేను శైలజ’ ఛాయలు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగుతుంది. అలా అని పూర్తిగా బోర్‌ కొట్టించే చిత్రం అయితే కాదు. కానీ కొత్తదనం మాత్రం ఆశించొద్దు. ఊర్వశితో వచ్చే ‘టిఫిన్‌ బాక్స్‌’జోక్‌ అయితే థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కిశోర్‌ తిరుమల డైలాగ్స్‌ ఆకట్టుకోవడమే కాదు.. ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక సాంకెతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top